భువనగిరి మదర్ డెయిరీలో అక్రమాలు.. ఆరుగురిపై సస్పెన్షన్ వేటు

తరచూ వివాదాల్లో ఉండే మదర్ డెయిరీ నిర్వహణ ఈసారి కొత్తరకం అవినీతితో మళ్లీ వెలుగులోకి వచ్చింది.

Update: 2024-12-26 02:14 GMT

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : తరచూ వివాదాల్లో ఉండే మదర్ డెయిరీ నిర్వహణ ఈసారి కొత్తరకం అవినీతితో మళ్లీ వెలుగులోకి వచ్చింది. మదర్ డెయిరీలో పనిచేసే అధికారులు సిబ్బంది వారు పని చేసే సెంటర్లలో తరచు పాల కొలతలతో పాటు అక్రమ బిల్లుల చెల్లింపులపై వార్తల్లోకి ఎక్కడం పరిపాటిగా మారింది. కానీ ఈసారి మాత్రం పాల కొలతలతో కాకుండా ఇతర తరహాలో జరిగే అవినీతి కి విరుద్ధంగా వెన్న శాతం లో అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో నుండి సెంటర్ల ద్వారా వచ్చే ఆవుపాలను బర్రె పాలుగా లెక్కలలో చూపించి నెలకు లక్షలు కాజేశారు. ఈ అక్రమ సంపాదనను మేనేజర్ నుంచి పాల సేకరణ కేంద్రం చైర్మన్ వరకు తిలాపాపం తలపిడికెడు అన్నట్లు పంచుకున్నారు. ఈ తంతు అంతా మదర్ డెయిరీ చైర్మన్ రెడ్డి తనిఖీలలో బహిర్గతం కావడం గమనార్హం.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మదర్ డెయిరీ మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఉంది. ఈ కేంద్రానికి పలు ప్రాంతాల నుండి పాలు పాడి రైతుల నుండి సేకరిస్తారు. ఈ తరుణంలో భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లి ఆవాస గ్రామమైన ఏం బాయి పాల కేంద్రం నుంచి వచ్చే ఆవు పాలలో 200 లీటర్లను బర్రెపాల వెన్న శాతం నమోదు చేసి బిల్లులు డ్రా చేశారు. ఉదయం 200 లీటర్లు, రాత్రి 200 లీటర్ల చొప్పున ప్రతి రోజు 400 లీటర్ల పాలను వెన్న శాతం పెంచి అధికంగా వచ్చిన సొమ్మును మేనేజర్ నుంచి సదరు పాల కేంద్రం చైర్మన్ వరకు వాటాలు పంచుకున్నట్లు సమాచారం. నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ జి మధుసూదన్ రెడ్డి గత శుక్రవారం రాత్రి భువనగిరి చిల్లింగ్ సెంటర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చైర్మన్ తనిఖీలలో ఈ అక్రమాలు బహిర్గతం కావడంతో విచారణ జరిపి బాధ్యులైన ఆరుగురిపై మంగళవారం సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేశారు.

నెలకు 2 లక్షలకు పైగా అవినీతి

మదర్ డెయిరీ నిబంధనల ప్రకారం ఉదయం పాలకు రాత్రి పాలకు వేరువేరుగా వెన్న శాతాన్ని లెక్కిస్తారు. ఆ వెన్న శాతం ప్రకారమే పాల రేటు నిర్ణయించి రైతులకు చెల్లింపులు జరుగుతాయి. ఉదయం పూట వచ్చే ఆవుపాలకు సుమారు 38 రూపాయలు, రాత్రి వచ్చే ఆవు పాలకు 36 రూపాయల చొప్పున పాడి రైతులకు చెల్లిస్తారు. బర్రె పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉండటం వలన ఉదయం పాలకు సుమారు 57 రూపాయలు, రాత్రి పాలకు సుమారు 52 రూపాయల చొప్పున చెల్లిస్తారు. అయితే ఎంబాయి పాల సేకరణ కేంద్రం నుంచి వచ్చే 200 లీటర్ల ఆవు పాలను బర్రె పాల వెన్న శాతం ఆధారంగా లెక్కించి సదరు పాల సేకరణ కేంద్రం చెల్లించారు. ఉదాహరణకు ఒక నెల తీసుకుంటే ఉదయం 6000 లీటర్లు, రాత్రి 6000 లీటర్లు ఆవు పాలు బర్రె పాలు గా మార్చారు.

6000 లీటర్లకు ఆవు పాలకు ఉదయం 38 రూపాయల చొప్పున చెల్లిస్తే నెలకు 2,28,000 రూపాయలు, రాత్రిపూట 6000 లీటర్లకు 36 రూపాయలు చెల్లిస్తే 2,16,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే భువనగిరి చిల్లింగ్ సెంటర్ నిర్వాహకులు బర్రె పాలకు ఇచ్చే ధరకు అనుగుణంగా ఉదయం 6000 లీటర్లకు 57 రూపాయలు చెల్లిస్తే 3,42,000 రాత్రి 6000 లీటర్లకు 52 రూపాయలు చెల్లిస్తే 3,12,000 రూపాయలు అవుతాయి. అయితే ఉదయం పూట 6000 లీటర్ల పాలపై లక్ష 14 వేల రూపాయలు, రాత్రిపూట పాలపై 96 వేల రూపాయలను కాజేశారు. ఆ కేంద్రానికి వాస్తవంగా చేరాల్సిన ఆవుపాల సొమ్ము చెల్లించి అదనంగా సుమారు రెండు లక్షల పైగా వచ్చిన ఆదాయాన్ని నిర్వాహకులు దండుకున్నారు. ఈ వ్యవహారమంతా సుమారు నాలుగు ఐదు నెలలుగా జరిగినట్లు సమాచారం.

మేనేజర్ సహా ఆరుగురు సస్పెండ్..

ఈ అవినీతిలో మేనేజర్ తో సహా ఆరుగురు వ్యక్తులు భాగస్వామ్యం అయినట్లు తేలడంతో ఈ ఆరుగురు పై మదర్ డెయిరీ చైర్మన్ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్ మేనేజర్, ఒక ప్రాసెసింగ్ సూపర్వైజర్, ఒక ల్యాబ్ అసిస్టెంట్, ఇద్దరు ఫీల్డ్ సూపర్వైజర్లు, ఒక ఆపరేటర్ లు సస్పెన్షన్కు గురయ్యారు. అయితే ఈ అక్రమ సంపాదనలో వచ్చిన సొమ్మును 60 శాతం మేనేజర్ కు 40 శాతం సదరు పాల సేకరణ కేంద్రం చైర్మన్ కు చేరినట్లు సమాచారం.

భార్య చైర్ పర్సన్, భర్త ఫీల్డ్ సూపర్వైజర్

అయితే ఈ అవినీతి భాగవతంలో మరొక వింత వ్యవహారం కనిపిస్తుంది. ఈ కేంద్రం యొక్క పాలను బర్రె పాలుగా చూపించి డబ్బులు కాజేశారో అదే పాల సేకరణ కేంద్రం చైర్పర్సన్ భర్త భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్ లో ఫీల్డ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. పాల కేంద్రం చైర్ పర్సన్, ఫీల్డ్ సూపర్వైజర్ భార్యాభర్తలు కావడంతో ఈ అవినీతికి దారి మరింత సులభంగా మారింది.


Similar News