కష్టపడి చదివాడు.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు..
ఆ కుటుంబంలో ప్రాథమిక స్థాయిలో కూడా ఎవరూ చదవలేదు.

దిశ, ఆత్మకూర్ ఎస్ : ఆ కుటుంబంలో ప్రాథమిక స్థాయిలో కూడా ఎవరూ చదవలేదు. సరైన చేయూత నిచ్చే వారు లేరు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చదువుకు ప్రాధాన్యతనిస్తూ మూడు ఉద్యోగాలను సాధించిన ఘనత ఆ యువకునికి దక్కింది. ఆత్మకూరు మండలం గట్టిగల్లు గ్రామానికి చెందిన కోన లింగయ్య పద్మల ప్రథమ పుత్రుడుకోన సతీష్ శుక్రవారం విడుదల చేసిన గ్రూప్ -3 ఫలితాల్లో స్టేట్ 211 ర్యాంక్ సాధించాడు.
గత 8 ఏళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తూ గ్రూప్స్ లో ఉద్యోగం సాధించాలన్న ఆశయంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చదువుకు ప్రాధాన్యతనిస్తూ ఎట్టకేలకు మరో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. గత సెప్టెంబర్ లో విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో సెలెక్ట్ అయ్యాక కూడా గ్రూప్స్ కు ప్రాధాన్యతనిస్తూ పట్టుదలతో చదువుకొని గ్రూప్ 3లో ర్యాంక్ సాధించాడు. భార్య ఇద్దరు కొడుకులు ఉన్నా వారి ఆలనా పాలన చూసుకుంటూ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగమే లక్ష్యంగా ప్రయత్నించి విజయం సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన సతీష్ తల్లిదండ్రులు కూలి పనులు చేసుకునేవారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో మూడు ఉద్యోగాలు సాధించిన సతీష్ ను గట్టికల్ గ్రామస్తులు అభినందించారు.