గంజాయి విక్రయదారుల అరెస్ట్.. గంజాయి స్వాధీనం..
గంజాయి విక్రయదారులను చిట్యాల పట్టణ కేంద్రంలో అరెస్టు చేసి వారి నుండి 1 1/2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి తెలిపారు.

దిశ, చిట్యాల : గంజాయి విక్రయదారులను చిట్యాల పట్టణ కేంద్రంలో అరెస్టు చేసి వారి నుండి 1 1/2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి తెలిపారు. శనివారం చిట్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఫతేపూర్ జిల్లా, కాగా మండలానికి చెందిన కమలేష్ పాల్, అదే ప్రాంతానికి చెందిన నిర్భయ సింగ్ లు బతుకుతెరువు కోసం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండల కేంద్రంలో గత కొంత కాలంగా నివాసం ఉంటూ ఇరువురు ఐస్ క్రీమ్ విక్రయించే వ్యాపారం చేస్తూ ప్రతిరోజు ఐస్ క్రీమ్ బండి పై తిరుగుతూ ఐస్ క్రీమ్ లను విక్రయించేవారు. వచ్చే సంపాదన సరిపోకపోవడంతో జల్సాలకు అలవాటు పడి అడ్డదారిలో డబ్బు సంపాదించాలని ఆశతో గంజాయి విక్రయానికి పూనుకున్నారు.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన పంకజ్ నుండి 37,500 విలువగల కేజీన్నర గంజాయిని కొనుగోలు చేసి అట్టి గంజాయిని చిట్యాల గ్రామ శివారులోని పంజాబీ ధాబా దగ్గరలో గంజాయి సేవించే విద్యార్థులకు, కంపెనీలలో పని చేసే కూలీలకు, లారీ డ్రైవర్లకు విక్రయించేవారు. శనివారం ఉదయం 8 గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు చిట్యాల ఎస్ఐ ఎన్.ధర్మ ఆధ్వర్యంలో పోలీసులు పంజాబీ దాబా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా వీరు కనబడడంతో వీరిని విచారించగా తాము డబ్బు సంపాదించే దుర్బుద్ధితో గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు. తాము విక్రయించిన గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి విద్యార్థులకు, లారీ డ్రైవర్లకు, కంపెనీ కార్మికులకు విక్రయిస్తున్నట్లు వారు తెలిపారన్నారు. వీర్ని అరెస్ట్ చేసి కేజీన్నర గంజాయిని, ఒక టీవీఎస్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాదకద్రవ్య వినియోగం పై ఉక్కుపాదం మోపాలనే కృత నిశ్చయంతో జిల్లా ఎస్పీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాడని, గంజాయి మాదకద్రవ్యాల విక్రయాల గురించి గానీ, సేవించే వ్యక్తుల గురించి గానీ సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 కు లేదా 8712670266 నెంబర్ కు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలిపారు..