ఎండిన పంటలకు నష్టపరిహారం వచ్చేనా..?

రాష్ట్ర సగటు వర్షపాతంతో పోలిస్తే సంస్థాన్ నారాయణపురం మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదు అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

Update: 2025-03-25 02:23 GMT
ఎండిన పంటలకు నష్టపరిహారం వచ్చేనా..?
  • whatsapp icon

దిశ,సంస్థాన్ నారాయణపురం : రాష్ట్ర సగటు వర్షపాతంతో పోలిస్తే సంస్థాన్ నారాయణపురం మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదు అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 914 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయితే ఈ మండలంలో 540 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదు అయింది. దీంతో మండలంలో భూగర్భ జలాలు కూడా పూర్తిస్థాయిలో అడుగంటి పోయాయి. ఈ మండలానికి సాగునీరు అవకాశాలు లేకపోవడంతో రైతులు బోరు మోటార్ల ద్వారానే సాగు చేస్తున్నారు. గత రెండు నెలల క్రితం బోర్లు బాగానే పోస్తుండడంతో అందుకు తగ్గట్టుగానే రైతులు వరి పంటను వేశారు. అయితే మార్చి నెల ప్రారంభంలోనే ఎండలుపెరగడంతో.. భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లలో నీరు తగ్గిపోయింది. దీంతో రైతులు వేసిన వరి పంట ఎండిపోవడంతో లబోదిబోమంటున్నారు.

5000 ఎకరాలలో వరి సాగు..

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో ప్రస్తుత యాసంగి సీజన్ లో సుమారు 5000 ఎకరాలలో వరి పంటను సాగు చేశారు. సీజన్ ప్రారంభకాలంలో నీటి లభ్యతను బట్టి వరిపంటను సాగు చేసిన గత కొన్ని రోజులుగా భూగర్భ జలాలు పడిపోవడంతో పంట చేలు ఎండిపోతున్నాయి. దీంతో వ్యవసాయ అధికారులు ఎండిన పంటలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు సుమారు 500 ఎకరాలకు పైగా ఎండినట్లు గుర్తించారు. ఇంకా 500 ఎకరాలు ఎండిపోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటి సరఫరా

పొట్ట దశకు వచ్చిన వరి చేలు నీరు లేక ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీంతో పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందుకు ఒక్కో ట్యాంకర్ కు 1000 రూపాయలు ఖర్చు వస్తుండడంతో రైతన్నలకు ఆర్థిక భారం తప్పడం లేదు. ఎలాగైనా పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరి నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు కూడా గ్రామంలో నీటి లభ్యత లేకపోవడంతో.. రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎండిపోయిన వరిపంటలో గొర్రెలను మేపుతూ తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.

ఎకరం సాగుకు రూ.20 వేల పైచిలుకు పెట్టుబడి!

ఒక ఎకరంలో వరి పంటను సాగి చేసేందుకు రైతుకు 20,000 రూపాయల పైచిలుకు పెట్టుబడి వస్తుంది. ఇప్పటికే దాదాపు అన్ని పొట్ట దశకు వచ్చాక పంట ఎండిపోవడంతో పెట్టిన పెట్టుబడి వృథా అయిపోయింది. అప్పులు చేసి పంటలు సాగు చేస్తే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లోకి వెళ్ళామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అత్యంత కరువు మండలంగా ఉన్న సంస్థాన్ నారాయణపురం రైతులను ఆదుకునేందుకు ఎకరానికి 20వేల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. లేదంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎండిన పంట పొలాలను గుర్తిస్తున్నాం : కే వర్షిత, మండల వ్యవసాయ అధికారిణి

ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఎండిన వరి చేలను గుర్తించే పనిలో ఉన్నాం. ఇప్పటికే సుమారు 500 ఎకరాల వరి పంట ఎండిపోయినట్లు గుర్తించాం. భూగర్భ జలాలు అడుగండడంతో బోర్లలో నీరు లేకపోవడంతో మరికొంత పంట ఎండిపోయే అవకాశం ఉంది.

ఎకరం వరిపంట ఎండిపోయింది :ముత్యాల అంజయ్య రైతు

రెండున్నర ఎకరాలలో ఈ యాసంగిలో వరి పంటను సాగు చేశాను. వరి పంట సాగు సమయంలో నీటి లభ్యత బాగానే ఉన్నా.. ప్రస్తుతం బోరు ఎండిపోవడంతో ఎకరం వరి పంట పూర్తిగా ఎండిపోయింది. ఎకరానికి సుమారు 30 వేల రూపాయల పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం ఉన్న పంటను కాపాడుకునేందుకు రోజు రెండువేల రూపాయలు చెల్లించి ట్యాంకర్ తో నీళ్లు సరఫరా చేస్తున్నాను.

ఎకరాకు రూ.20000 నష్టపరిహారం అందించాలి: పల్లె మల్లారెడ్డి ,రైతు సంఘం కార్యదర్శి

భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలలో కూరుకుపోయారు. ప్రభుత్వం ఎండిన వరి పంటకు ఒక ఎకరాకు 20వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించాలి. రైతుల వారీగా ప్రభుత్వం వివరాలు సేకరించి తగిన న్యాయం చేయాలి.


Similar News