పార్టీ కోసం కష్టపడితే పదవులు దక్కుతాయి.. మాజీ మంత్రి జానారెడ్డి
పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పదవి అవకాశం వస్తుందని, ఆ పదవి ప్రజల కోసమే అని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి అన్నారు.

దిశ, మిర్యాలగూడ : పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పదవి అవకాశం వస్తుందని, ఆ పదవి ప్రజల కోసమే అని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి అన్నారు. శనివారం నూతనంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికై మిర్యాలగూడ పట్టణానికి వచ్చిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ స్వాగత ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని మాడుగులపల్లి, వేములపల్లి గ్రామాలతో పాటు వైస్ జంక్షన్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రాంతం రాష్ట్రానికి దిక్సూచిగా మారాలని అందుకు అనుగుణంగా విభేదాలు లేకుండా అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. ఎన్నో రకాల కష్టనష్టాలను ఓర్చుకొని పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు దక్కుతాయని ఈ ఎమ్మెల్సీ ఎంపిక ద్వారా కార్యకర్తలు గుర్తు చేసుకోవాలని అన్నారు. ఎలాంటి విభేదాలు రాకుండా అందర్నీ సమన్వయపరుస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసికట్టుగా పనిచేస్తూ కార్యకర్తలకు అండదండగా ఉండి వారి అభివృద్ధి కోసం ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ జానా రెడ్డి దగ్గర నుంచి మంచి నడవడికతో పాటు పార్టీ కోసం ఎలా విధేయతతో నడుచుకోవాలో నేర్చుకున్నానని అన్నారు. జానారెడ్డి సహకారంతోనే సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్సీ పదవి వరకు తాను ఎదిగానని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ అభివృద్ధి కోసం తనతో పాటు మిగతా ప్రజాప్రతినిధులు కలిసి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాజకీయ విభేదాలు లేకుండా ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. తనతోపాటు ఎమ్మెల్సీ, ఎంపీ నిధులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలు నూతన ఎమ్మెల్సీ ని పూలమాల తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కైలాబ్ నాయక్, నూకల వేణుగోపాల్ రెడ్డి, చిరుమర్రి కృష్ణయ్య, గడ్డం వేణుగోపాల్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి, రామలింగయ్య యాదవ్, మాలి కాంతారెడ్డి, పుట్టల కృపయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.