సంఘ బంధాల్లో వీబీకేలు చేస్తున్న అవినీతిపై విచారణ జరపాలి
జిల్లాలోని ఆత్మకూరు (ఎస్) మండలం పాతర్ల పాడు గ్రామంలోని సంఘ బంధాల్లో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని పాతర్లపాడు సంఘ బంధం సభ్యులు పులి వినోద, బోలక పద్మ, భీమ గానిత రాధమ్మ డిమాండ్ చేశారు.
దిశ, సూర్యాపేట : జిల్లాలోని ఆత్మకూరు (ఎస్) మండలం పాతర్ల పాడు గ్రామంలోని సంఘ బంధాల్లో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని పాతర్లపాడు సంఘ బంధం సభ్యులు పులి వినోద, బోలక పద్మ, భీమ గానిత రాధమ్మ డిమాండ్ చేశారు. అందుకోసం వారు సభ్యులతో కలిసి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… పాతర్ల పాడు గ్రామంలో విలేజ్ బుక్ కీపర్ (వీబీకే)లుగా పని చేస్తున్న గుంటూరు తిరుమలమ్మ, మద్దికుంట రాధ, కొప్పుల మానసలు గత 10 ఏళ్లుగా పని చేస్తున్నారు. అందులో వారు చెప్పిందే వేదంగా పని చేయాలని హుకుం జారీ చేస్తూ, చదువురాని సంఘ బంధం సభ్యుల సంబంధిత బుక్కులు దగ్గర పెట్టుకొని వారికి తెలియకుండానే వారిచే సంతకాలు పెట్టించుకుంటున్నారని ఆరోపించారు. పొదుపు తీసుకున్నారంటే పర్సంటేజ్‌ల రూపంలో వాళ్లకు ఇవ్వాల్సిందేనన్నారు. లేదంటే లోన్లు ఇవ్వమని వీబీకేలు బెదిరిస్తున్నారని చెప్పారు. ఎలాంటి అర్హతలు లేకుండా వీళ్ళు వీబికేలుగా కొనసాగుతున్నారని, గ్రామంలో ఎంతో మంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారని వీళ్ళనే ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. ప్రతి రెండేళ్లకొకసారి నూతన బాడిని ఎన్నుకోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారని వాపోయారు.
తాళ్ల సింగారం గ్రామంలో ఎస్బీఐలో దాదాపు మూడు కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు ఆరోపించారు. మా గ్రామ సమభావన సంఘాలలో పొదుపు చేస్తున్న మహిళా సంఘాలు 77 ఉన్నాయని, 3 సంఘ బంధాలు ఉన్నట్లు తెలిపారు. ఆ ఎస్బీఐ అకౌంట్‌లో లక్ష రూపాయలు జమైనప్పటికీ అందులో నుండి మా గ్రూప్ అధ్యక్షురాలు అకౌంట్ కు రూ. 9,000 వేలు జమ అయినట్లు వచ్చాయని తెలిపారు. వీబీకేలు మాతో పాటు బ్యాంకు అధికారులను సైతం మోసం చేసి లక్షల రూపాయలను డ్రా చేసుకొని స్వప్రయోజనాల కోసం వాడుకుంటుందని తెలిపారు. అందుకు ఈ ముగ్గురు వీబీకేలు చేస్తున్న అవినీతి పై జిల్లా ఉన్నతాధికారి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గాద గాని శోభ, పబ్బతి గంగమ్మ , యమ గాని లక్ష్మి, గుంటూరు లలిత, గంగపురి స్వర్ణ, తదితరులు పాల్గొన్నారు.