మైనింగ్ అనుమతులు లేకుండానే గుట్ట మాయం..!
రాజకీయ నాయకుల అండదండలు ఉంటే చాలు ఏ
దిశ,సంస్థాన్ నారాయణపురం: రాజకీయ నాయకుల అండదండలు ఉంటే చాలు ఏ పని అయినా చేస్తామని ధైర్యంతో ఎలాంటి అనుమతులు లేకుండానే తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండలో ఓసియన్ ప్రెస్టేజ్ అనే సంస్థ 930 ఎకరాలకు పైగా లేఅవుట్ ను ఏర్పాటు చేశారు. కేవలం పేపర్ల పైనే లేఅవుట్ చూయించి ఇష్టానుసారంగా అమ్మకాలు జరిపారు. దీంతో కొనుగోలుదారులు వెంచర్ యజమాని పై పదుల సంఖ్యలో కేసులు వేసినట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వెంచర్ యజమాని తప్పించుకు తిరుగుతున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు... రాజకీయ నాయకుల అండదండలతో డబ్బులతో ఈ అక్రమ లేఅవుట్ లో ఇష్టానుసారంగా తప్పుడు డాక్యుమెంట్లను సృష్టిస్తూ ఖాళీ జాగా కనపడ్డ ప్రతి చోట పాగా వేస్తూ కోట్లు కొల్లగొట్టారు. అయితే తాజాగా ఓ మంత్రి అత్యంత అనుచరుడి సహకారంతోనే ఎలాంటి మైనింగ్ అనుమతులు పొందకుండానే చదును చేస్తున్నారు.
జిల్లా మంత్రి అనుచరుడి అండదండలతోనే..?
నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన జిల్లా మంత్రి ప్రధాన అనుచరుడి అండదండలతోనే రాచకొండలో గుట్టను ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకుండా మాయం చేస్తున్నారు. రాచకొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 84 లో రాచకొండ హిల్ రిసార్ట్ పేరుతో గత రెండు నెలల క్రితం పనులు ప్రారంభించారు. రాచకొండ ప్రాంతంలో 930 పైగా ఎకరాలలో ఓసియన్ ప్రెస్టేజ్ పేరుతో ఏర్పాటుచేసిన వెంచర్ ఎలాంటి వసతులు పూర్తి చేయకుండానే నిర్వాహకులు మధ్యంతరంగా వదిలి వెళ్లిపోయారు. మొత్తం విస్తీర్ణం లోని భూమిని పేపర్ల పై చూయించి వివిధ ప్రాంతాల్లో ఉన్న వారికి అప్పట్లోనే అమ్మకాలు జరిపారు. దీంతో కొనుగోలుదారులు తమ ప్లాట్లు ఎక్కడో తెలియక వెంచర్ నిర్వాహకులపై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. అయినా కూడా ఇలా ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు రాజకీయ అండదండలతో రాచకొండ ప్రాంతంలో గద్దల్లా వాలి ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు. అయితే తాజాగా జిల్లాలో ప్రధాన పదవి అనుభవిస్తున్న నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన మంత్రి అనుచరుడి సహకారంతోనే గుట్టను తొలగిస్తున్నారని ఆరోపణలపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మంత్రికి తెలియకుండా ఆయన అనుచరులు మంత్రికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా మంత్రి దృష్టి సారించి సదరు అనుచరులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
అంతా నడిపించేది ఆ ఒక్కడే..?
రాచకొండ ప్రాంతంలోని అక్రమ లేఔట్లలో ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా తనకు నచ్చిన వారిని ముందు ఉంచి ఒక్కడే ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. ఓసియన్ ప్రెస్టేజ్ యజమాని వెంచర్ ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడ సూపర్వైజర్ గా పని చేసినట్లు సమాచారం. ఈ మొత్తం వెంచర్ పై సదరు వ్యక్తికి పూర్తి అవగాహన ఉండడం తో తనకు నచ్చిన వ్యక్తులకు సహకరిస్తూ ఎక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయో అక్కడ వారిని కబ్జా చేసేలా ప్రోత్సహిస్తున్నాడు. సదరు వ్యక్తిని కాదని ఇంకా ఎవరైనా అక్కడికి వస్తే ఇతరులతో బెదిరించి వారిని అక్కడ ఉండకుండా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అసలు ఈ మొత్తం వ్యవహారానికి కారకుడైన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తాయని సమాచారం.
హిల్ రిసార్ట్ ఫేజ్-2 ఉంటుందా..?
ప్రస్తుతం గుట్టను చదును చేసి రాచకొండలో హిల్ రిసార్ట్ ఫేజ్ -1 బోర్డు ఏర్పాటు చేసి నిర్వాహకులు పనులు చేస్తున్నారు. అంటే ఇది పూర్తి చేసి మరో దగ్గర గుట్టపై హిల్ రిసార్ట్ ఫేజ్ -2 పేరుతో మళ్ళీ పనులు చేస్తారేమోననే అనుమానం కలగ మానదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అక్రమ వెంచర్ పై దృష్టి సారించి కబ్జాదారుల ఆటలకు కళ్లెం వేయాలని కోరుకుంటున్నారు.ప్రస్తుతం జరుగుతున్న పనులపై స్థానిక తాసిల్దార్,పంచాయతీ కార్యదర్శిని అనుమతుల వివరాలు అడగగా మేము ఎలాంటి ఎన్ఓసీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.