సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్

సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు జరపాలని పత్తి రైతులు గురువారం చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

Update: 2025-01-09 09:27 GMT

దిశ, చిట్యాల: సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు జరపాలని పత్తి రైతులు గురువారం చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. చిట్యాల పట్టణ కేంద్రంలోని శ్రీకృష్ణ కాటన్ మిల్ వద్దకు పత్తిని విక్రయించేందుకు వాహనాల్లో తీసుకువచ్చి మూడు రోజులు పడిగాపులు గాస్తున్నప్పటికీ సీసీఐ అధికారులు కొనుగోలు బందు చేసినట్లు తెలపడంతో..ఒకసారిగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఎన్ ధర్మ సిబ్బందితో హుటాహుటిన రైతుల వద్దకు వచ్చి వారికి నచ్చజెప్పి నిరసనను విరమింప చేశారు. అనంతరం కాటన్ మిల్లు వద్ద రైతులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. అనంతరం సిసిఐ అధికారులతో పత్తి కొనుగోలు చేసే విధంగా చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు మాట్లాడుతూ..గత కొద్దిరోజులుగా చిట్యాల మండలమే కాకుండా మునుగోడు, చండూరు, సంస్థాన్ నారాయణపురం, నార్కెట్పల్లి మండలాల నుంచి కూడా రైతులు పత్తిని విక్రయించేందుకు కృష్ణ కాటన్ మిల్లు సీసీఐ కేంద్రానికి తీసుకువచ్చి రెండు, మూడు రోజులు అవుతున్నప్పటికీ సీసీఐ సిబ్బంది అకస్మాత్తుగా కొనుగోలు నిలుపుదల చేసినట్లు తెలిపారు. నాణ్యమైన పత్తి తీసుకు రావడంలేదని చెదలు, మైలపట్టిన పత్తి, నాసిరకమైన పత్తి సీసీఐ కేంద్రానికి తీసుకురావడం వల్లే సీసీఐ కొనుగోలు నిలుపుదల చేశామని సీసీఐ అధికారులు చెబుతున్నట్లు రైతులు వాపోయారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే తమకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఎలాగైనా అధికారులు పత్తి కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.


Similar News