దొంగ అని అనుమానించారు..చివరికి మహిళ ఆత్మహత్య..

అవమాన భారంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని సిరిపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

Update: 2025-01-09 16:23 GMT

దిశ,రామన్నపేట : అవమాన భారంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని సిరిపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన రాపోలు నరేష్ కర్నూలు జిల్లా ఆదోని మండలానికి చెందిన రమ్యను ప్రేమించి 12 సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఒక కూతురు జన్మించారు. అదే గ్రామానికి చెందిన మానస హయత్ నగర్ మండలంలోని మునగనూరులో నివాసం ఉంటున్నారు. ఈనెల 5వ తేదీ ఆదివారం నాడు మానస కొడుకు పుట్టినరోజు వేడుక ఉండగా..ఆహ్వానించడంతో ఆదివారం నరేష్ ,రమ్య దంపతులు హయత్ నగర్ కు వెళ్లారు. జంగిలి, మురళి దంపతులు కూడా వచ్చారు. రాత్రి కావడంతో ఆరోజు అక్కడే నిద్రించి సోమవారం ఉదయం సిరిపురం గ్రామానికి నరేష్ దంపతులు చేరుకున్నారు.

ఈ నెల 6న సాయంత్రం మానస ఫోన్ చేసి మురళికి చెందిన రెండు తులాల బంగారు నగలు పోయినవి నీకేమైనా దొరికిందా అని అడిగింది. కొద్ది సమయం తర్వాత మురళి ఫోన్ చేసి..బంగారం పోయింది నీ భార్య దొంగిలించిందని గట్టిగా వాదించాడు. మాకు సంబంధం లేదు, మేము తీయలేదు అని చెప్పినా వినకుండా వాదిస్తూనే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ రావడంతో.. అక్కడికి వెళ్లి ఎస్ఐని కలిశారు. అనంతరం ఎస్సై ముందే మురళి అనే వ్యక్తి 50,000 ఖర్చుపెట్టి అయినా సరే మిమ్మల్ని రౌడీలను పెట్టి కొట్టిస్తామని బెదిరించారు. దీంతో మానసిక వేదనకు గురైన రమ్య గురువారం తెల్లవారుజామున నైట్ ఆఫ్ సేవించి ఆత్మహత్యకు పాల్పడిందని రమ్య భర్త నరేష్ తెలిపారు. ఆత్మహత్యకు కారణమైన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రమ్య భర్త నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై పి.మల్లయ్య పేర్కొన్నారు.

బంధువుల ఆందోళన...

అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకున్న నరేష్ భార్య రమ్య బంధువులు పోలీస్ స్టేషన్ సమీపంలోని భువనగిరి-చిట్యాల రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రమ్య కుటుంబానికి న్యాయం జరగాలని, అసలైన దోషులను గుర్తించి శిక్షించాలని, అవమానభారానికి గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐ ఎన్.వెంకటేశ్వర్లు జోక్యం చేసుకొని, దోషులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళనను విరమించారు.


Similar News