నత్తనడకన సాగుతున్న జాతీయ రహదారి విస్తరణ..ఎక్కడంటే..?
గౌరెల్లి జంక్షన్ నుంచి ఇల్లందు బయ్యారం వరకు జరుగుతున్న జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతోంది
దిశ తిరుమలగిరి: గౌరెల్లి జంక్షన్ నుంచి ఇల్లందు బయ్యారం వరకు జరుగుతున్న జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతోంది. దీంతో తిరుమలగిరి మండల పరిధిలోని అనంతారం నుంచి తిరుమలగిరికి మధ్యన రోడ్డు పనులు నిబంధనలకు విరుద్ధంగా సదరు కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా సాగిస్తున్నాడు. ఈ రోడ్డు మార్గం గుండా వెళ్లాలంటే..కళ్ళు పోతున్నాయి బాబోయ్.. అంటూ ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. మట్టితో కూడిన దుమ్ము,ధూళి విపరీతంగా లేస్తుండడంతో పెద్ద వాహనాల వెనుక నుంచి వెళ్లే ద్విచక్ర వాహనదారులకు,ఆటో,కారు ఇతర వాహనదారులకు రోడ్డు మార్గం కనిపించకుండా పోతుంది. దుమ్ము లేగుస్తుండడంతో కళ్ళల్లో దుమ్ము, ధూళి పడి ప్రమాదాలు జరిగే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కనీసం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో ట్యాంకర్ తో నీళ్లు చల్లి పనులు సాగించాలని ప్రయాణికులు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు నిబంధనలో ఈ విధంగా నీళ్లు కొడుతూ పనులు చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని ,రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ..రోడ్డు పనుల్లో దుమ్ము, ధూళి లేవకుండా నీళ్లు పనులు కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.