Suryapeta: అడ్మిషన్ల కక్కుర్తి.. కార్పొరేట్ కళాశాలల మాయాజాలం

Update: 2024-12-02 02:03 GMT

దిశ,సూర్యాపేట టౌన్: సూర్యా పేట జిల్లాలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రాకముందే కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల పక్రియను ప్రారంభించాయి. విద్యార్థుల అడ్రస్ లు సేకరించిన యాజమాన్యాలు ఏజెంట్లను రంగంలోకి దింపాయి. వారు విద్యార్థుల ఇళ్లకు చేరుకుని ఫలానా కళాశాలలో చేర్పిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని తల్లిదండ్రులను నమ్మిస్తున్నారు. ఇప్పటికే చాలామంది నుంచి అడ్వాన్సులు కట్టించుకుంటున్నారు. కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి ఒక్కో బ్రాంచ్ లో ఒక్కో ధర ఉంటుంది. ఇంజినీరింగ్, మెడిసిన్ కోసం ప్రిపేర్ చేయడానికి అందులోనూ రకరకాల పేర్లతో బ్యాచ్ లను తయారు చేసి బోధిస్తారు. ఫలానా బ్రాంచ్ లో చదివిస్తే ఎంపీసీ పిల్లలకు జేఈఈ పక్కా వస్తుందని, ఫలానా బ్రాంచ్ లో చదివిస్తే మెడిసిన్ సీట్ వచ్చి తీరుతుందని నమ్మిస్తూ ఏటా అడ్మిషన్లు బుక్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా విద్యార్థుల అడ్మిషన్ల పక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలామంది విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో అడ్వాన్సులు చెల్లించి కర్చీప్ వేశారు. తల్లిదండ్రుల ఆశలను ఆయా కాలేజీల యాజమాన్యాలు వ్యాపారంగా మార్చుకుని ఏడాది కేడాది ఫీజులు దండిగా పెంచేస్తున్నాయి. మెడిసిన్, ఇంజినీరింగ్ లో మంచి ర్యాంకులు సాధించాలంటే మంచి కాలేజీని ఎంచుకోవాలని చెబుతూ ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. చాలా మంది మధ్య తరగతి. దిగువ మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలకు మంచి చదువు కోసమంటూ అప్పులు చేసి మరీ ఆయా కళాశాలల్లో చేర్పిస్తున్నారు.

పోటీ ప్రపంచంలో ఒత్తిడి తట్టుకోలేక..

పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే కార్పొ రేట్ చదువులు ఒక్కటే దారి అన్న భావన తల్లిదండ్రుల్లో పెరిగిపోయింది. దీంతో పిల్లల మానసిక స్థితి, వారి ఆసక్తిని గమనించకుండానే మంచి మార్కులు, ర్యాంకుల కోసమంటూ తమ పిల్లలను కార్పొరేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. అయితే కొందరు పిల్లలు ఇష్టం లేకున్నా కన్నవారి మాట కాదనలేక ఆయా కళాశాలల్లో చేరుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. పిట్టగూడులాంటి అపార్టుమెంట్లలో కొనసాగుతున్న కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులకు కనీసం సూర్య కిరణాలు కూడా దరిచేరడం లేదు. క్లాస్ రూం, డైనింగ్ హాల్, హాస్టల్ తప్ప మరో లోకం తెలియడం లేదు. నిరంతరం చదవడం మూలంగా చాలామంది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు.. దానికితోడు అక్కడ అందించే భోజనం రుచించక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఆత్మకూర్ ఎస్ పాత సూర్యాపేట గ్రామానికి చెందిన ఓ విద్యార్ధి హైదరాబాద్ లోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్లో చేరాడు.

ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్లో చేరిన వారం రోజులకే తలనొప్పి వస్తుందని పిచ్చి పట్టినట్టుగా చేశాడు. దీంతో తల్లిదండ్రులు ఆ విద్యార్థినిని హాస్పిటల్ కి తీసుకెళ్లగా మానసిక ఒత్తిడికి లోనవడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నాడని, మానసిక ఒత్తిడికి గురిచేయొద్దని వైద్యుడు సలహా ఇచ్చాడు. దీంతో ఆ తల్లిదండ్రులు పిల్లాడిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. అప్పటికే కార్పొరేట్ కాలేజీలో చాలా ఫీజు కట్టామని, కాలేజ్ చుట్టూ నెలరోజులు తిరిగిన ఫీజు తిరిగి ఇవ్వలేదని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆ కార్పొరేట్ కాలేజీలో చదవడం మా వల్ల కావడం లేదని ఆ విద్యార్థితో కలిసి ఆ కాలేజీలో చదివిన పలువురు విద్యార్థులు వెనక్కి వచ్చారు. అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కాలేజీలు కక్కుర్తి పడి మొదట మాయ మాటలు చెప్పి అడ్మిషన్లు వల వేస్తూ ఏజెంట్లు వారికి వచ్చే కమీషన్ల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని కొంతమంది నెటిజెన్లు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు విద్యార్థులపై ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి చేయకుండా వారికి నచ్చిన కోర్సు తీసుకునేలా నచ్చిన కాలేజీలో చేర్పించి వారి భవిష్యత్తును కాపాడాలని నెటిజెన్లు కోరుతున్నారు..

ఒత్తిడి లేని చదువులు కావాలి.. డాక్టర్ సునీల్ కుమార్

తల్లిదండ్రులు రూ.లక్షల్లో కాలేజీ ఫీజులు కట్టి తమ పిల్లలను తామే పేషెంట్లుగా తయారు చేస్తున్నారు. మార్కుల వేటలో పడి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చేర్పిస్తున్నారు. మార్కులు, ర్యాంకుల కోసం యాజమాన్యాలు పిల్లలపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు మానసికంగా దెబ్బ తింటున్నారు. మార్కుల కోసమో, గొప్పతనం కోసమో పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు. చిన్నప్పటి నుంచి పిల్లలకు గోల్ సెట్ చేయాలి. లేదా వాళ్ల ఆసక్తిని గమనించాలి. ఎలాంటి ఒత్తిడులు పెట్టకుండా ప్రోత్సహిస్తే వారు చక్కగా చదవగలుగుతారు. అలాంటి వాతావరణంలోనే పిల్లలు సక్సెస్ కాగలరు.

అడ్మిషన్ల కోసం ఫోన్ చేస్తున్నారు.. బొల్లం మల్లేష్ యాదవ్

మా ఏరియాలో ఉన్న తల్లిదండ్రులకు చెప్పి అడ్మిషన్లు ఇప్పియమని కార్పొరేట్ కాలేజీ ఏజెంట్లు ఫోన్ చేస్తున్నారు. గతంలో వాళ్ల మాటలు నమ్మి కొన్ని అడ్మిషన్లు ఇప్పించాను. అక్కడ సరైన సౌకర్యాలు లేవని, సరైన భోజనం లభించడం లేదని పొద్దున లేచి మొదలు రాత్రి పడుకునే దాకా పుస్తకాలతోనే గడపాల్సిన పరిస్థితి వస్తుందని ఆ విద్యార్థులు నాకు చెప్పడంతో నేను కాలేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నించాను. కానీ వారి నుంచి సరైన సమాధానం లభించలేదు. పిల్లల మానసిక స్థితిని అర్ధం చేసుకుని అందుకు తగ్గట్టుగా వ్యవహరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన, అధ్యాపకులపైన ఉంది.


Similar News