సంగం డైరీ ఫామ్ నిలిపివేయాలని ధర్నా..
మిర్యాలగూడ మండలం శ్రీనివాస నగర్ సమీపంలో ఉన్న సంగం డైరీ ఫామ్ వద్ద స్దానికులు సోమవారం ధర్నా చేపట్టారు.
దిశ, మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం శ్రీనివాస నగర్ సమీపంలో ఉన్న సంగం డైరీ ఫామ్ వద్ద స్దానికులు సోమవారం ధర్నా చేపట్టారు. అనుమతులు లేకుండా అక్రమంగా పాల కేంద్రం నిర్వహిస్తున్నారని, బకాయి బిల్లులు చెల్లింపు, వ్యర్ధాల ప్లాంట్ తొలగించాలని డిమాండ్ చేస్తూ సామ్యతండా, తుంగపహడ్ ,శ్రీనివాస్ నగర్ లకు చెందిన బాధితులు, ప్రజలు కోదాడ జడ్చర్ల రహదారి పై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. దీంతో ఈ రోడ్డులో సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సామ్యతండా వద్ద అక్రమంగా వ్యర్ధాల ప్లాంట్ ఏర్పాటు చేశారని ఆరోపించారు.
ప్లాంట్ వ్యర్ధాల వలన అనారోగ్యానికి గురైతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించి ప్లాంట్ ను తొలగించాలని కోరారు. గతంలో నిర్వహణలో ఉన్న వి.టి డైరీ ఫామ్ బకాయిలు చెల్లించకుండా విక్రయించారని ఆరోపించారు. కోట్ల రూపాయాలు మేర ఉన్న పాల బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పలుమార్లు సంగం యాజమాన్యానికి విన్నవించుకున్న స్పందించడం లేదని వాపోయారు. అనుమతులు లేకుండా నిర్వహణ సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా వాహనాల రాకపోకలు నిచిపోవడంతో పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళన కారులకు నచ్చజెప్పి విరమింపజేశారు.