ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు
ఆర్ఎంపీలు తమ స్థాయికి మించి వైద్యం చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం హెచ్చరించారు.
దిశ, తుంగతుర్తి: ఆర్ఎంపీలు తమ స్థాయికి మించి వైద్యం చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం హెచ్చరించారు. బుధవారం తుంగతుర్తి మండల పరిధిలోని మంచతండా గ్రామపంచాయతీలో ఆర్ఎంపీ వైద్యుడు భూక్య కిషన్ తన స్థాయికి మించి వైద్యం చేయడంతో పాటు గర్భిణీ స్త్రీలను ఖమ్మం తరలించి అబార్షన్ చేస్తున్నాడనే ఆరోపణలు రావడంతో తండాకు డాక్టర్ కోటాచలం వెళ్లి అతడు నిర్వహిస్తున్న క్లినిక్ పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న హై క్వాలిఫై డాక్టర్లు ఉపయోగించే మందులతో పాటు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన సోదాల్లో ఆర్ఎంపీ తన ఇంట్లో ఓ చిన్నపాటి మెడికల్ షాప్ నిర్వహిస్తూ తన స్థాయికి మించి వైద్యాన్ని చేస్తున్నాడని తెలిపారు.
గర్భం దాల్చిన మహిళలను లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలిస్తూ చేయిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్ఎంపీ మహిళలకు అబార్షన్ చేస్తున్నాడనే ఫిర్యాదులు తమకు అందాయని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించిన, వాటిని చేసిన వారిపై పోలీస్ చర్యలు తప్పవన్నారు. తమకు ఫిర్యాదు అందగానే తండాకు వెళ్లి అతని ఇంటిపై సోదాలు నిర్వహించి క్వాలిఫై డాక్టర్లు ఉపయోగించే మందులను, ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆయనపై చర్యల నిమిత్తం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ మేరకు క్లినిక్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు.నిబంధనల మేరకు ఆర్ఎంపి లు తమ ఆసుపత్రులలో కేవలం ప్రథమ చికిత్స చేసి పై ఆసుపత్రులకు పంపాలన్నారు. ఆర్ఎంపీ డాక్టర్లు తమ క్లినిక్‌లకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లుగా మాత్రమే బోర్డులు పెట్టుకోవాలని, ఈ బోర్డులలో ఎంబీబీఎస్, ఇతర సర్టిఫికెట్ కోర్సుల పేర్లను పెట్టుకోవడం నేరమన్నారు. వైద్యం పేరుతో అమాయక ప్రజల నుంచి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేయొద్దని, అలాంటి వారిపై ఫిర్యాదులు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పరిమితికి మించి ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎవరైనా ఆపరేషన్లు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో తుంగతుర్తి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్మల్ కుమార్, వైద్యాధికారి లింగమూర్తి, జిల్లా విస్తరణ మాధ్యమాధికారి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.