పేరుకుపోతున్న ఆసుపత్రుల విద్యుత్ బకాయిలు
రూ.10 బకాయిలు ఉంటే సరఫరా నిలిపేస్తామంటూ విద్యుత్ శాఖ చేసే హడావుడి అంతా ఇంతా కాదు.
దిశ,తుంగతుర్తి: రూ.10 బకాయిలు ఉంటే సరఫరా నిలిపేస్తామంటూ విద్యుత్ శాఖ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి విషయానికి వచ్చేసరికి ఆ శాఖ “ఎమర్జెన్సీ” అనే అంశంతో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది.పైగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేరుకుపోయిన రూ.లక్షలాది బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ శాఖ ఎన్నోమార్లు వివిధ తరహాలలో విజ్ఞప్తి చేసినప్పటికీ ఉలుకు లేదు...! పలుకు లేదు...!!. దీంతో ఏమి చేయాలో తెలియక విద్యుత్ శాఖ తల పట్టుకుంటోంది.
దీనికి ఉదాహరణే నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి. గత కొన్ని మాసాల నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించడంలో సామాజిక ఆరోగ్య కేంద్రం కాలయాపన చేస్తోంది. చివరికి “ఇంతింతై- వటుడంతై” అనే సామెత మాదిరిగా బకాయిలన్నీ క్రమక్రమంగా పేరుకుపోయి రూ.5.85 లక్షలకు చేరాయి. అయితే మొదటి నుండి బకాయిలు చెల్లించాలంటూ ఆ శాఖ అధికారులు మొత్తుకోవడమే కాకుండా నోటీసుల మీద నోటీసులు కూడా ఇచ్చారు. అయినా వైద్య శాఖలో ఏమాత్రం స్పందన లేదు. చివరికి బకాయిల భారాన్ని మోయలేకపోతున్న విద్యుత్ శాఖ కఠినమైన నిర్ణయంతో సరఫరాను నిలిపేద్దామంటే సాహసం చేయలేకపోతోంది. ఎందుకంటే ప్రభుత్వ వైద్యశాల అనేది అత్యవసర సర్వీసుల విభాగం పరిధిలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. దీంతో విద్యుత్ శాఖ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవేళ విద్యుత్ సరఫరాను నిలిపిస్తే అందులో ఉన్న వివిధ రకాల మెడిసిన్ చెడిపోయి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో.. అనే భయం ఆ శాఖ సిబ్బందిలో నెలకొంది. మరి సరఫరా వ్యవస్థని అలాగే కొనసాగిస్తే బకాయిలన్నీ తడిసి మోపెడవుతున్నాయి. ఇలాంటి పరిణామాలతో విద్యుత్ శాఖ అధికారుల పరిస్థితి “ముందు నుయ్యి -వెనక గొయ్యి”అనే మాదిరిగా తయారయింది. ఈ విషయమై తుంగతుర్తి ఆసుపత్రి సూపరిండెంట్ నిర్మల్ కుమార్ ను వివరణ కోరితే విద్యుత్ బకాయి ఉన్న మాట వాస్తవమేనంటూ చెప్పుకొచ్చారు. విద్యుత్ బిల్లులు జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వారే సంబంధిత విద్యుత్ శాఖకు బిల్లు చెల్లిస్తారని తెలిపారు.