ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో..: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సికింద్రాబాద్ అల్వాల్ లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రిని రాష్ట్ర
దిశ,తిరుమలగిరి : సికింద్రాబాద్ అల్వాల్ లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రిని రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు మంగళవారం నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నామని,సుమారు రూ.897 కోట్ల అంచనాలతో అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని,ఆసుపత్రి 11.53లక్షల స్క్వేర్ ఫీట్లలో ఈ ఆసుపత్రి నిర్మాణం అవుతుందని 90 శాతం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని అన్నారు.సనత్ నగర్,ఎల్బీ నగర్ ల లోని టిమ్స్ నిర్మాణాల్లో ధర్మశాల ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు నిర్మించడం లేదని అధికారులను నిలదీశారు.నిర్మాణంలో శాఖల మధ్య సమన్వయం లేకనే పనులు ఆలస్యం అవడం బాధాకరం అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని,2025 డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో సనత్ నగర్,ఎల్బీ నగర్,అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులు పూర్తి చేయాలని లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.హాస్పిటల్ భూమికి ఇబ్బందులు ఎదురైనప్పుడు తానే ఎన్ఓసీ ఇప్పించి భూ సమస్యను పరిష్కరించానని అన్నారు.గత ప్రభుత్వం ఒక్కో పనికి ఒక్కో టెండర్ పిలిచి అంతా గందరగోళం చేస్తే అన్నింటిని సరిదిద్దానని అన్నారు.మనం నిర్మిస్తుంది పేద ప్రజల ఆరోగ్యాలు కాపాడే ఆసుపత్రి అని అందుకే జాగ్రత్తగా,నాణ్యంగా,వేగంగా పనులు చేయాలని,ఆసుపత్రిని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో ముందుకు సాగాలని నిర్మాణ సంస్థకు సూచించారు.
ఈ సందర్బంగా మంత్రితో సంబంధిత అధికారులు,నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్ లు మాట్లాడుతు 35డిపార్ట్మెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.24ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయని సంబంధిత అధికారులు మంత్రి కి వివరించారు.వాస్తు పేరిట గత ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయడం వల్ల పనుల్లో ఆలస్యం జరిగిందని ఆస్పత్రి నిర్మాణ సంస్థ మంత్రికి తెలియజేసింది.ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తానని,ఇప్పటికైనా శరవేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు.ఎలాంటి లాభాపేక్షా లేని ఆర్గనైజషన్ వలే పది మంది మెచ్చేలా ఆసుపత్రిని నిర్మించాలని,మేజర్ ఓటీ,ఏమర్జెన్సీ,రెడీయల్ వార్డు,ఆంకలాజీ,న్యూక్లియర్ మెడిసిన్ విభాగలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.అదేవిదంగా ఆపరేషన్ థియేటర్,ఇతర మెడికల్ వార్డ్స్ నిర్మాణంలో వైద్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఉస్మానియా హాస్పిటల్ క్లోజ్ అయ్యిందని,గాంధీలో పెషేంట్లు ఎక్కువగా వస్తున్నారని దీంతో వందల అంబులెన్సులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని ఈ 3టిమ్స్, పంజాగుట్ట నిమ్స్ పూర్తయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.ఆరోగ్యశ్రీ ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని,ఈ టీమ్స్ ఆస్పత్రులను నిర్మిస్తే రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆనందం వ్యక్తం చేశారు.పేదవాళ్ల ప్రాణాలను నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ ఆశయమని,ఎల్ఓసీ,సీఎంఆర్ఎఫ్ ల క్రింద ప్రతిరోజు లక్షల రూపాయలు పేదలకు ఇచ్చి ప్రాణాలు నిలబెడుతున్నామని,ఏడాది కాలంలో ఆరోగ్యశ్రీ కి1600కోట్లు ఇచ్చామని అన్నారు.కెటిఆర్ విచారణపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు చట్టం తన పని తాను చేసుకుపోతుందని జవాబు ఇచ్చారు.మేం పేద ప్రజల కోసం పని చేస్తుంటే వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రపతి భవన్ సూచనల మేరకు రోడ్డు సైడ్ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా ఆసుపత్రి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం పర్యవేక్షిస్తున్నారని,ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి కట్టుబడి ఉందని,వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి టిమ్స్ ఆసుపత్రి నిరంతరం సిద్ధంగా పని చేస్తుందని మంత్రి వివరించారు.ఈ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయి ప్రారంభమైనట్లైతే నగరంలోని ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న పలు జిల్లాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.ఆసుపత్రిలో అన్ని విభాగాలకు చెందిన అత్యాధునికమైన చికిత్స అందుబాటులో ఉంటుందని,ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్,రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్,పలు శాఖల ప్రభుత్వ అధికారులు,స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.