శ్రీకర ఇన్ఫ్రా మాయ !
వినియోగదారులను సంతృప్తి పరచడమే తమ లక్ష్యం అంటూ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు రంగు రంగు బ్రోచర్లు చేసి ముందస్తుగా ఫ్లాట్ లను విక్రయిస్తున్నారు.
దిశ, సంస్థాన్ నారాయణపురం : వినియోగదారులను సంతృప్తి పరచడమే తమ లక్ష్యం అంటూ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు రంగు రంగు బ్రోచర్లు చేసి ముందస్తుగా ఫ్లాట్ లను విక్రయిస్తున్నారు. వీటిలలో ప్లాట్లు కొన్నవారు ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది మోసపోయారు. ముందస్తుగా ప్లాట్లు కొన్న తర్వాత వినియోగదారులకు సరైన సౌకర్యాలు కల్పించకుండానే ప్లాట్లు మొత్తాన్ని విక్రయించి అక్కడి నుంచి జెండా ఎత్తిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వెంకంభావి తండా గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 216, 217, 220 లలో 15 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో శ్రీకర ఇన్ఫ్రా పేరుతో వెంచర్ ను ఏర్పాటు చేశారు. వీరు డీటీపీసీ నుంచి ప్రారంభ అనుమతి తీసుకొని పనులు ప్రారంభించారు. కానీ ఎలాంటి వసతులు పూర్తి చేయకుండానే ప్లాట్ల అమ్మకాలు మొదలుపెట్టారు.
బ్రోచర్లలో మాత్రమే వసతులు..
వెంకం భావి తండా మమదాబాద్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన శ్రీకర ఇన్ఫ్రా వెంచర్ యాజమాన్యం ఎలాంటి వసతులు పూర్తి చేయకుండానే ప్లాట్ల అమ్మకాలను దాదాపు పూర్తి చేసింది. ఇది కొండ ప్రాంతం కావడంతో ప్రశాంత వాతావరణం ఉండడంతో హైదరాబాద్ లో నివాసం ఉండే వారికి బ్రోచర్లలో ఆన్లైన్ ద్వారానే అమ్మకాలు జరపడం మొదలు పెట్టారు. అంతేకాకుండా పర్యాటక కేంద్రానికి దగ్గరగా ఉండడంతో కస్టమర్లను బురిడీ కొట్టించి ఎలాంటి వసతులు పూర్తి కాకుండా అని అమ్మకాలు పూర్తి చేస్తున్నారు. శ్రీకర ఇన్ఫ్రా యాజమాన్యం మార్కెటింగ్ ప్రతినిధులను నియమించి భారీగానే సొమ్ము చేసుకుంటుంది. గజం ఏడు వేల పైనే నిర్ణయించి ఇప్పటికే వందకు పైగా ప్లాట్లను విక్రయించారు.
కొనుగోలుదారులు ఇక్కట్లు పడక తప్పదా ?
శ్రీకర యాజమాన్యం ఎలాంటి వసతులు పూర్తికాకుండానే ప్లాట్లను విక్రయిస్తుండడం దీనికి మధ్యవర్తులుగా మార్కెటింగ్ ప్రతినిధులను నియమించడంతో వారి మాటలు నమ్మి కొనుగోలు దారులు ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. వసతులు పూర్తికాకుండానే యజమాన్యం ఇక్కడి నుంచి జెండా ఎత్తితే మార్కెటింగ్ ప్రతినిధులు ఎవరు కూడా ఇందుకు బాధ్యత వహించరు. అసలు ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ కాకుండానే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తున్నాడని అనుమానం కలుగుతుంది. ఫైనల్ లేఔట్ అప్రూవల్ వచ్చేవరకు సబ్ రిజిస్ట్రార్ సదరు వెంచర్ లో రిజిస్ట్రేషన్ ను నిలిపివేసి వినియోగదారుల హక్కులను కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న పంచాయతీ అధికారులు కూడా వసతులు పూర్తి కాకుండా అన్ని అమ్మకాలు జరుపుతున్న శ్రీకర ఇన్ఫ్రా యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.