సర్వేల్ గురుకులంలో దారుణం..విద్యార్థికి తీవ్ర గాయం
రాష్ట్రంలో పేరొందిన గురుకుల విద్యాలయాలలో సర్వేలు గురుకులం ఒకటి.
దిశ,సంస్థాన్ నారాయణపురం : రాష్ట్రంలో పేరొందిన గురుకుల విద్యాలయాలలో సర్వేలు గురుకులం ఒకటి. అలాంటి పాఠశాలలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ లోని బాలుర గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతికి చదువుతున్న..శివరాత్రి శామ్యూల్ అనే విద్యార్థి అల్పాహార సమయంలో విద్యార్థులందరికీ రాగిజావ పోసేందుకు గిన్నెను పైకి ఎత్తాడు. దీంతో ఒక్కసారిగా గిన్నె శామ్యూల్ కాళ్ళ మీద పడి తీవ్ర గాయాలయ్యాయి. శామ్యూల్ ను హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనలో శామ్యూల్ తో పాటు మరో ఇద్దరు కూడా గాయపడినట్లు తెలుస్తుంది. జి మదన్ అనే వ్యక్తి కూడా గాయపడడంతో.. ఆయనకు పాఠశాలలోనే ఆయింట్మెంట్ రాసి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. విద్యార్థులకు వడ్డించాల్సిన వంట మాస్టర్లు ఉండగా.. ఎనిమిదో తరగతి విద్యార్థులతోనే నిత్యం వడ్డించడంతోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు విద్యార్థులు తెలిపారు. అంతేకాకుండా గురుకుల పాఠశాలలోని డిప్యూటీ వార్డెన్ తొందరపాటు కూడా ఇందుకు కారణంగా తెలుస్తుంది. బుధవారం అసలు మెనూలో లేని రాగి జావాను విద్యార్థులకు వడ్డించడం చూస్తే ..అసలు ప్రతిరోజు మెనూ పాటించడం లేదని అనుమానం కలుగుతుంది. జరిగిన ప్రమాదంపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశంను వివరణ కోరగా.. విద్యార్థులు ఎవరు వడ్డించడం లేదని వంట చేసే వాళ్ళు వడ్డించే సమయంలో గిన్నె జారడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.