R. S. Praveen Kumar : అక్రమ అరెస్ట్‌లతో బహుజన వాదాన్ని ఆపలేరు
అక్రమ అరెస్ట్‌లు బహుజన వాదాన్ని ఆపలేరని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
దిశ, సూర్యాపేట: అక్రమ అరెస్ట్‌లు బహుజన వాదాన్ని ఆపలేరని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో విద్యా నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బీఎస్పీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్వీ డిగ్రీ కాలేజ్ నుంచి బీఎస్సీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీఎస్పీ నాయకురాలు వట్టె రేణుక జానయ్య యాదవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. వట్టె జానయ్య ఆస్తులు అడుగుతున్న మంత్రి జగదీష్ రెడ్డి.. తన ఆస్తులను వెల్లడించగలరా అని ప్రశ్నించారు. తన భర్తకు న్యాయం జరగాలని ఒక మహిళ ఒంటరి పోరాటం చేస్తున్నందున ఆమెకు బీఎస్పీ అండగా నిలిచిందన్నారు.
సూర్యాపేట ఎమ్మెల్యేగా వట్టె జానయ్య యాదవ్‌ని క్యాంప్ కార్యాలయంలో కూర్చోబెట్టి తీరుతామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు మన బహుజన రాజ్యం కోసం బీఎస్పీకి మద్దతు ఇవ్వాలని కోరారు. జిల్లా ఎస్పీగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ అధికార పార్టీ నాయకుడి విద్యార్థులతో జై కొట్టించడం ఎంత వరకు కరెక్ట్ అని అన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆక్రమించిన భూములు లక్షల కోట్లల్లో ఉన్నాయని త్వరలోనే చిట్టా బయట పెడతామని చెప్పారు. కాళోజి నారాయణరావు చెప్పినట్లు ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతి పెట్డాలని చెప్పిన విషయాన్ని ఈ సంధర్భంగా గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బహుజనుల వాదిగా సూర్యాపేట నియోజకవర్గం నుండి వట్టె జానయ్య యాదవ్ బరిలోకి దిగబోతున్నాడని ఆయనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకురాలు, 13 వ వార్డు కౌన్సిలర్ వట్టె రేణుక జానయ్య యాదవ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బుడిగం మల్లేష్ యాదవ్, చాంద్ పాషా, శ్రీకాంత్, వల్లాల సైదులు, వెంకట్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.