RRR: రాయగిరి ప్రజల్లో ట్రిపుల్ ఆర్ భయం.. అలైన్‌మెంట్ మార్పునకు రైతుల ఎదురుచూపు
భువనగిరి మండలం రాయగిరితో పాటు మరికొన్ని గ్రామాల్లో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు భయం భయంగా జీవనం కొనసాగిస్తున్నారు.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి మండలం రాయగిరితో పాటు మరికొన్ని గ్రామాల్లో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు భయం భయంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు తమ గ్రామంలోని భూములను ప్రభుత్వానికి అప్పగించిన రైతులు.. ఇప్పుడు మరోసారి ఆ ప్రాజెక్టుకు అప్పగిస్తే తాము రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ అలైన్‌మెంట్ ఉన్న చోటు నుంచి మార్చి రాయగిరి మీదుగా వెళ్లే విధంగా కుట్ర చేశారని, తిరిగి అలైన్‌మెంట్‌ను మార్చాలని గత రెండేళ్లుగా రాయిగిరితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. భూముల సేకరణ ఆపాలని హైకోర్టును సైతం ఆశ్రయించారు.
రైతుల నుంచి వ్యతిరేకత..
ఈ ట్రిపుల్ ఆర్ నిర్మాణం కోసం భూ సేకరణ కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా రైతులు వ్యతిరేకిస్తునే ఉన్నారు. యాదాద్రి జిల్లాలో రైతులు ఇప్పటికే మూడు సార్లు వివిధ ప్రాజెక్టుల కోసం తమ విలువైన భూములను కోల్పోయామని, మళ్లీ ఇప్పుడు కొత్తగా ట్రిపుల్ ఆర్ కోసం సైతం భూమి ఇవ్వాల్సి రావడంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మొదట మార్కింగ్ ఇచ్చిన ప్రకారం కాకుండా అలైన్‌మెంట్ మార్చారని ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలోనూ వ్యతిరేకతను వెల్లడించారు.
తీవ్ర ఆందోళనలో రైతులు..
అయితే ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి ప్రభుత్వం వేగవంతం చేయడంతో రైతులలో తీవ్రస్థాయిలో ఆందోళన నెలకొంది. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి భూముల సేకరణలో భాగంగా ఇప్పటికే చౌటుప్పల్ మండలంలో కూడా మార్కింగ్ పూర్తయింది. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎన్నికల ముందు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అలైన్‌మెంట్‌లు మార్చే విధంగా ప్రయత్నం చేస్తానని భరోసానిచ్చారు. ఇప్పుడు అలైన్‌మెంట్ మార్పుపై అనిల్‌కుమార్ రెడ్డి స్పందించాలని బాధిత రైతులు కోరుకుంటున్నారు. ఈ అలైన్‌మెంట్‌పై ఇప్పటికే పలు మాలరు జిల్లా మంత్రి కోమటిరెడ్డిని, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డిని కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. కేంద్ర మంత్రుల నుంచి, రాష్ట్ర మంత్రుల వరకు కలిసి తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
పోరాటం చేస్తున్న రైతులు..
తమ భూములను ఈ ప్రాజెక్టుకు అప్పగించబోమని రైతులు బలంగా పోరాటం చేస్తున్నారు. దీంతో గతంలో హైకోర్టు రాయగిరి ట్రిపుల్ ఆర్‌పై స్టే ఇచ్చింది. అటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తున్నారు. మరోవైపు ప్రజా ప్రతినిధుల సహకారం కోసం కృషి చేస్తున్నారు. ఇలా బాధిత రైతులు తమకు తోచిన విధంగా భూముల సేకరణ జరగకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే, అలైన్‌మెంట్‌పై రాయగిరి నుంచి మార్పు కోసం సంబంధిత రైతులంత ఆశతో ఎదురుచూస్తున్నారు.