రేవంత్ పాలన భేష్....
బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడం సంతోషకరమని రేవంత్ పాలన భేష్ అని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
దిశ, యాదాద్రి కలెక్టరేట్: బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడం సంతోషకరమని రేవంత్ పాలన భేష్ అని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం పట్టణంలోని ఏఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ బ్లాక్మెయిలింగ్ రాజకీయం చేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. మహిళల అభ్యున్నతిని గాలికి వదిలేసి మహిళలపై దాడులు, అరాచకాలకు పాల్పడుతుందన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్లు వ్యవహారం దేశంలో అతిపెద్ద కుంభకోణం అని పేర్కొన్నారు. దేశంలో ఎనిమిది వేల కోట్లకు పైగా ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ముట్టాయన్నారు. కేంద్ర ప్రభుత్వమే అవినీతిని చట్టబద్ధం చేసిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు రిలీజ్‌ను తక్కువ రేటుకు ఇచ్చి ఆ కంపెనీ నుండి రూ.25 కోట్లలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకుందన్నారు.
ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణంలో అన్ని రాజకీయ పార్టీలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులు ఫ్యాషన్‌గా మారాయి అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చేరడం ప్రస్తుత రాజకీయ నాయకులకు ఆనవాయితీగా మారింది అన్నారు. రాజకీయం వ్యాపారం వేరువేరుగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్య విలువలు బతికి ఉన్నాయని అన్నారు. రాజకీయం, వ్యాపారం ఒక్కటై డబ్బు, కులం చూసి అభ్యర్థులను ఎంపిక చేసే పరిస్థితి వచ్చింది అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, ఎండీ జహంగీర్, మల్లు లక్ష్మి, కొండమడుగు నరసింహ ఉన్నారు.