పైసా వసూల్.. అంతా మా ఇష్టం !
చేనును కాపాడాల్సిన కంచెనే ఆ చేనును మేసినట్లుగా ఉంది ఓ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మండల స్థాయి అధికారి తీరు.
దిశ, మునుగోడు; చేనును కాపాడాల్సిన కంచెనే ఆ చేనును మేసినట్లుగా ఉంది ఓ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మండల స్థాయి అధికారి తీరు. అవినీతికి పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది చేసే తప్పిదాలను పసిగట్టి దాని పేరుతో అంతర్గత విచారణకు పాల్పడుతూ..దర్జాగా వసూళ్ల చేస్తున్నారు. ఈ తతంగమంతా మునుగోడు మండల కేంద్రంలోని మండల మహిళ సమాఖ్య కార్యాలయం (ఐకేపీ)లో గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న ఓ మండల స్థాయి అధికారి తీరుపై బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ధనార్జనే ధ్యేయంగా అధికారి తీరు..
ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలతో, ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో రాయితీ రుణాలు అందిస్తోంది. వాటిని నేరుగా లబ్దిదారులకు చేకూర్చేందుకు మహిళ సమాఖ్య కార్యాలయం (ఐకేపీ) పరిధిలో సుమారు 42మంది గ్రామ స్థాయి విబికేలు పనిచేస్తున్నారు. గ్రామ పరిధిలో ఉన్న మహిళ సంఘాలకు రుణాలు ఇప్పించడంతో పాటు..ప్రతి నెల సక్రమంగా డబ్బులను చెల్లించే విధంగా పూర్తి భాద్యత వీరిపై ఉంటుంది. కానీ వారి తప్పు ఓప్పులు పసిగట్టి వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా..అంతర్గత విచారణ పేరుతో ముక్కుపిండి ఇష్టానుసారంగా విబికేల నుంచి అడ్డగోలుగా డబ్బులను వసూల్ చేస్తున్నారు. అంతే కాకుండా వారి వద్ద నుంచే బదులు పేరుతో అదనంగా డబ్బులను వసూల్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా అప్పుగా ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగితే వారిపై శాఖ పరంగా కక్ష్య సాధింపులకు పాల్పడుతూ..బెదిరింపులకు గురి చేస్తున్నారు. అందుకు నిదర్శనమే ఓ గ్రామంలోని విబికే వద్ద రూ.20వేలు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇది కేవలం ఒక్క గ్రామంలోనే కాకుండా ప్రతి విబికే వద్ద ఇలాగనే వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఇదీలా ఉండగా బైలా పుస్తకాల పేరుతో విబికే నుంచి రూ.1000చొప్పున సుమారుగా రూ.40వేలు వరకు వసూల్ చేసినట్లుగా సమాచారం. ఆ అధికారి గతంలో పనిచేసిన చోట ఈ విధంగానే వ్యవహరించడంతో అక్కడ ఓ ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి మందలించినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇంత జరుగుతున్న నన్ను ఎవ్వరూ కూడా ఏమి చేయలేరని(ఐ డోంట్ కేర్) అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైన జిల్లా ఉన్నత స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సదరు అవినీతి అధికారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.