మహిళలకు ఉన్నంత శక్తి విశ్వంలో ఎవరికీ లేదు
విశ్వంలో మహిళలకు ఉన్నంత శక్తి ఎవ్వరికి లేదని, వారికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
దిశ, మునుగోడు : విశ్వంలో మహిళలకు ఉన్నంత శక్తి ఎవ్వరికి లేదని, వారికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పులిపలుపుల గ్రామంలో 20 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నూతన భవన నిర్మాణానికి, బీరెల్లి గూడెం గ్రామంలో 20 లక్షలతో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి, కొరటికల్ గ్రామంలో 2 కోట్ల 30 లక్షలతో నూతనంగా నిర్మించే 33/11 కె వి విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా - విజయోత్సవాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకై అనేక మంది ప్రాణ త్యాగాలు చేసుకుంటే చలించి సోనియమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణలో పేద ప్రజలు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల బతుకులు బాగుపడుతాయని రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవ్వరి బతుకులు మారలేదన్నారు. మీ అందరి ఆశీర్వాదంతోనే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామిని నేరవేరుస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఇల్లులేని పేదలందరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో 1692 మహిళా సంఘాలకు 15 కోట్ల 20 లక్షల బ్యాంకు రుణాలు, ఆరు మండలాలలోని 1184 మహిళా స్వయం సహాయక సంఘాలకు 46 లక్షల 72 వేల వడ్డీ లేని రుణాలు, ఆరు మండలాల్లోని 816 మహిళా సంఘాలకు 17 కోట్ల 32 లక్షల రుణాలను ప్రభుత్వం తరపున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ, యాదాద్రి జిల్లా డిఆర్డిఏ పీడీలు శేఖర్ రెడ్డి, నాగిరెడ్డి, ఆర్డివో శ్రీదేవి, ఎంపిడివో విజయభాస్కర్, ఏపిఎం మైసేశ్వరావు, మండల పార్టి అధ్యక్షులు బీమనపల్లి సైదులు, మాజీ జడ్పిటిసి నారబోయిన స్వరూపరాణి రవిముదిరాజ్, చిలుకూరి ప్రభాకర్, నాయకులు అనంత లింగస్వామి, పాల్వాయి జితేందర్, దోటి నారాయణ, ఎండి అన్వర్, నాగరాజు, తదితరులు పాల్గోన్నారు.