‘అంబుజా’ వద్దు..పోరుబాట పడుతున్న పల్లెలు
యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని
దిశ,నల్లగొండ బ్యూరో : యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయసేకరణ సమయంలో ఇప్పటికే తమ నిరసనను తెలియజేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో యువతకు ఉపాధి లభిస్తుందని ఓ అభిప్రాయముండగా.. పచ్చని పొలాలు బీడుగా మారుతాయని 24 గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. డ్రై పోర్ట్ పేరిట సేకరించిన భూమిలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సరికాదంటున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడుతామని పేర్కొంటున్నారు. మరోవైపు పలు పార్టీలు, ప్రజా సంఘాలు సైతం సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి.
డ్రై పోర్ట్ పేరిట..
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. దీని కోసం ప్రత్యేక పాలసీని తీసుకువచ్చింది. తెలంగాణకు తీరప్రాంతం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా సరిహద్దున ఉన్న కోదాడ-గుంటూరు జిల్లా బార్డర్స్ లో దామరచర్ల జాతీయ రహదారి, బీబీనగర్ నడికుడి ప్రధాన రైల్వేలైన్‌ను ఆనుకొని ఉన్న చిట్యాల లేదా రామన్నపేటలో డ్రైపోర్ట్ నిర్మించాలని భావించింది. దీంతో రామన్నపేట మండల కేంద్రం సమీపంలో దాదాపు 365 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు సంస్థ 2021-22 మధ్య స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసింది. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా డ్రై పోర్ట్ ఏర్పాటు అంశం ముందుకు సాగలేదు.
సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయంతో..
బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక.. రామన్నపేట పరిసరాల్లో సేకరించిన 365 ఎకరాల భూమిని సదరు ప్రైవేటు సంస్థ.. అదానీ గ్రూపునకు అప్పగించింది. దీంతో అక్కడ సుమారు 70 ఎకరాల్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈక్రమంలో వివిధ గ్రామాల్లో ప్రజాభిప్రాయసేకరణ సైతం చేపట్టారు. డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామంటే తాము భూములను ఇచ్చామని.. ఇప్పుడు కాలుష్యానికి కారణమయ్యే సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్మించాలనుకుంటే ఒప్పుకునేది లేదని పరిసర గ్రామాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు.
కాలుష్యభయం..
రామన్నపేట మండలంలో 24 గ్రామపంచాయతీ ఉంటే.. సుమారు 12 జీపీలు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వెదజల్లే కాలుష్యం వల్ల ప్రభావితమయ్యే అవకాశముందని ప్రజలు పేర్కొంటున్నారు. రామన్నపేటకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూసీ కాలుష్యంతో సతమతమవుతున్నామని వాపోతున్నారు. మూసీకి తోడుగా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఆ కాలుష్యాన్ని భరించలేమని చెబుతున్నారు. అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు బీళ్లుగా మారుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని పేర్కొంటున్నారు.
పల్లెల పోరుబాట..
సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం గత అక్టోబర్‌లో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఆ సమయంలో సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఇప్పుడు పెద్దవ్యాప్తంగా ఆందోళనలు చేసేందుకు ఆయా గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు. పార్టీలు, సంఘాలకు అతీతంగా వివిధ గ్రామాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నారు. ఇప్పటికే రామన్నపేటకు సమీపంలో ఉన్న మేజర్ గ్రామపంచాయతీలు సిరిపురం, వెల్లంకి గ్రామాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. మూకుమ్మడిగా ప్రజలంతా ఈ దీక్షల్లో పాల్గొని సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై తమకున్న వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేస్తున్నారు.
జేఏసీ ఏర్పాటు ఆలోచన..
సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై నిరసన తెలియజేసేందుకు పార్టీలు, సంఘాలకతీతంగా జేఏసీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీని కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతులను చేస్తూనే.. కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నాయి. జేఏసీగా ఏర్పడి త్వరలో కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం.
తీవ్ర ప్రతిఘటన తప్పదు : బొడ్డుపల్లి వెంకటేశం, సీపీఎం మండల కార్యదర్శి
సిమెంటు ఫ్యాక్టరీ వద్దని ప్రజాభిప్రాయ సేకరణ సమయంలోనే ప్రజలు స్పష్టంగా చెప్పారు. అప్పుడు అధికారులు తయారు చేసిన రిపోర్టును బహిర్గతం చేయాలి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు.
పర్యావరణ విధ్వంసం : ఊట్కూరి నర్సింహా, సీపీఐ మండల కార్యదర్శి
ఫ్యాక్టరీ ఏర్పాటుతో పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ఫ్యాక్టరీ వల్ల వచ్చే ధూళి, ప్రమాదకర రసాయనాలతో వాయుకాలుష్యం జరుగుతుంది. దీంతో ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉంది.
వ్యవసాయంపై తీవ్ర ప్రభావం : మేక శోక్ రెడ్డి, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు
సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో వేలాది ఎకరాల్లో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. పచ్చని పంట పొలాలు బీళ్లుగా కూడా మారే ప్రమాదముంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. అంతేకాకుండా పండే పంటలు సైతం విషపూరితంగా మారవచ్చు.
మహిళలు రోగాల బారిన పడే ప్రమాదం : గాదె శోభ రాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, రామన్నపేట మండలం
సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల వచ్చే దుమ్ము, ధూళితో లంగ్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ముఖ్యంగా మహిళలకు శ్వాసకోశ, గర్భ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న మూసీ వల్ల మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఆలోచనను విరమించుకోవాలి.
మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయొద్దు : సాల్వేరు అశోక్, రామన్నపేట మాజీ ఎంపీటీసీ
సిమెంట్ ప్యాక్టరీ నిర్మిస్తే మా తర్వాత తరాల పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. గ్రామంలో 80శాతం ప్రజలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారు ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. సిమెంట్ ప్యాక్టరీ వద్దని ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.