రమణ రేషన్ లోడెత్తాలిరా.. పక్క రాష్ట్రానికి తరలించాలి!!

పేదలకు అందాల్సిన ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పడుతోంది. సంబంధిత అధికారుల నిఘా లేకపోవడం తో రేషన్ దందా అడ్డు అదుపు లేకుండా ఈ దందా కొనసాగుతోంది.

Update: 2024-10-20 05:41 GMT

దిశ, సూర్యాపేట టౌన్: పేదలకు అందాల్సిన ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పడుతోంది. సంబంధిత అధికారుల నిఘా లేకపోవడం తో రేషన్ దందా అడ్డు అదుపు లేకుండా ఈ దందా కొనసాగుతోంది. సూర్యాపేట పట్టణంలో ప్రతి నెల 10వ తారీకు నుంచి 24 తారీకు వరకు రమణ లోడ్ ఎత్తాలి రా! అనే పదం బాగా విస్తృతం మవుతుంది. కొన్ని రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యం ప్రతి నెల పక్కదారి పడుతూ లోడ్లకు లోడ్ లు రాష్ట్రం దాటిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమంగా బియ్యం పంపిణీ అవుతున్న పట్టించుకోకపోవడంతో అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రo లో ఓ ప్రైవేటు వ్యక్తి ఈ దందా లో కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు భారీగా ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో ఈ రేషన్ దందా జోరుగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ దందాను రేషన్ షాపు ల డీలర్లు కూడా షురూ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు తుంగతుర్తి, హుజూర్ నగర్, కోదాడ, పలు మండలాల్లోని కొన్ని గ్రామాలను దందా దారులు దత్తత తీసుకున్నారు.

ప్రతి నెల డీలర్లు, ప్రజల నుంచి కొనుగోలు చేసి నేరుగా దందా దారులకు రేషన్ డీలర్ కొనుగోలు చేస్తుండటం గమనార్హం. పట్టణ, గ్రామ శివారులో రైస్ మిల్లులను అడ్డగా చేసుకుని కొందరు పీడీఎస్ బియ్యం దందాను యథేచ్చగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ దందాలో ఆరితేరిన కేటుగాళ్లు తమకు అనుకూలమైన పరిస్థితులను తీసుకొచ్చేందుకు చక్రం తిప్పడం మొదలు పెట్టినట్లు సమాచారం. రాజకీయ అండదండలు, అర్థబలం ఆసరా చేసుకుని ఈ దందాను లాభార్జనకు మార్గంగా మలుచుకుంటున్నారు. గ్రామాల్లో ఎక్కువగా చైన్ సిస్టం వ్యవస్థను ప్రోత్సహిస్తూ, రేషన్ షాపుల నుంచి కార్డుల ద్వారా తీసుకునే బియ్యాన్ని డీలర్లు సేకరించి పెద్ద మొత్తంలో పోగుచేసి కొందరికి దందా దారులకు అప్పగిస్తున్నారు. ఇందుకోసం దందా దారులు ఏకంగా ఏజెంట్లను కూడా నియమించుకోవడం గమనార్హం. సేకరించిన బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో నిల్వచేసి అదను చూసి పోలీసులు, పౌరసరఫరాల అధికారుల కళ్లు కప్పి లారీలు, డీసీఎం వ్యాన్‌లో తరలిస్తున్నారు.

కొనుగోళ్లకు దుకాణాలు..

కొందరు వ్యాపారులు ఇంటింటా తిరిగి బియ్యం సేకరించి బయట విక్రయిస్తున్నారు. పట్టణంలో గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఇళ్లను కొందరు వ్యాపారులు అద్దెకు తీసుకుంటున్నారు. ప్రజల నుంచి సేకరించిన బియ్యాన్ని ఇంట్లోనే డంప్ చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని లారీల్లో, డీసీఎం లో ఇతర ప్రాంతాలకు రవాణా చేసిన తర్వాత ఇక్కడ ఇంటిని ఖాళీ చేసి మరో కాలనీలో అద్దె ఇల్లును తీసుకుంటున్నారు ఇలాంటి ఘటనలు జిల్లాలో అధికంగా ఉన్నాయి. రేషన్ బియ్యం పంపిణీ చేసే రోజుల్లోనే ఈ దుకాణాలు పని చేస్తుండటం గమనార్హం. ఇతర రాష్ట్రాలలో మన బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. కిలో బియ్యం రూ.20 నుంచి రూ. 30 వరకు ధర పలుకుతోంది. సూర్యాపేట జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో రేషన్ కార్డుదారుల నుంచి కిలోకు రూ.10 నుంచి రూ.13 కు కొనుగోలు చేసి లారీ, డీసీఎంల్లో రాత్రికి రాత్రే సరిహద్దులు దాటిస్తున్నారు. ఒక లారీ లోడ్ బియ్యం సరిహద్దులు దాటిస్తే రూ.4 లక్షలు పై చిలుకు వచ్చినట్లే, పెద్ద మొత్తంలో జేబులు నిండుతుండడంతో ఈ దందాను బంగారు గుడ్లు పెట్టే బాతుల్లా భావిస్తున్నారు..

అధికారుల పైనా అనుమానాలు..!

గ్రామాల్లో బహిరంగంగా రేషన్ బియ్యం కొనుగోళ్లు జరుగుతున్నా అరికట్టాల్సిన అధికారులు మాత్రం మౌనం దాల్చుతున్నారన్న విమర్శలున్నాయి. అక్కడక్కడ అడపా దడపా దాడులే తప్ప ఖచ్చితమైన సమాచారం ఉన్నా దాడులు జరపడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమందిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపు కుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారుల సపోర్ట్ తోనే కొందరు డీలర్లు వచ్చిన బియ్యాన్ని వచ్చినట్లే అమ్ముతుండడం గమనార్హం. అధికారుల సహకారంతో బియ్యం మూడు పువ్వులు కాయలు గా వర్ధిల్లుతోందనే ఆరోపణలు ఉన్నాయి.


Similar News