Ts News:తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో మరిన్ని పథకాలు..!
తెలంగాణ సీఎం కేసీఆర్ పథకాల విషయంలో దూకుడు పెంచబోతున్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు..
దిశ, వెబ్ డెస్క్: ఇప్పుడు ఎక్కడ చూసినా పథకాల పంట పండుతోంది. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో ఆయా ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పథకాల విషయంలో పోటీ పడుతున్నాయి. ఏపీలో సీఎం జగన్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ కల్యాణ లక్ష్మి, బీసీ బంధు, దళిత బంధు, గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఆసరా పింఛన్లు అంటూ సీఎం కేసీఆర్ సైతం పథకాల పంట పారిస్తున్నారు.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈసారి కూడా గెలిచి తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టేందుకు సీఎం కేసీఆర్ తహతహలాడుతున్నారు. ఈ సమయంలో అటు కాంగ్రెస్ పార్టీ కూడా పట్టు బిగిస్తోంది. కాంగ్రెస్ డిక్లరేషన్ అంటూ ప్రజలను ఆకట్టుకునేలా పథకాలు ప్రకటిస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ పథకాల విషయంలో మరింత దూకుడు పెంచుతున్నారు. మరిన్ని కొత్త పథకాలు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్ని వర్గాలను ఆకర్షించేలా పథకాలను రూపొందిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు ముందే లీక్ చేసేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన హరీశ్.. త్వరలో తెలంగాణ ప్రజలు మరిన్ని శుభవార్తలు వింటారని స్పష్టం చేశారు. ప్రజల కోసం సీఎం కేసీఆర్ మరిన్ని కొత్త పథకాలను తీసుకురాబోతున్నారని తెలిపారు. దీంతో తెలంగాణలో పథకాల వరద పారనుందని పలువురు చర్చించుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.