కేవైసీ ఎఫెక్ట్.. నరకయాతన పడుతున్న గ్యాస్ వినియోగదారులు
మీరు గ్యాస్ వినియోగదారులా..! అయితే మీ గ్యాస్‌కు కేవైసీ చేయించాలా..!! అయితే కష్టమైన నష్టమైన దేనితో సంబంధం లేకుండా కచ్చితంగా 50 కి.మీ దూరం ప్రయాణించాల్సిందే.
దిశ, తుంగతుర్తి: మీరు గ్యాస్ వినియోగదారులా..! అయితే మీ గ్యాస్‌కు కేవైసీ చేయించాలా..!! అయితే కష్టమైన నష్టమైన దేనితో సంబంధం లేకుండా కచ్చితంగా 50 కి.మీ దూరం ప్రయాణించాల్సిందే. అయితే మీరు వెళ్ళగానే అక్కడైనా జరుగుతుందా..? లేదా..?? అనే దానికి గ్యారెంటీ కూడా లేదు. ఒకవేళ పని జరిగితే మీ అంత అదృష్టవంతుడే ఉండడు. జరగకపోతే మళ్లీ మళ్లీ తిరగాల్సిందే..!మొత్తానికి పని కోసం రవాణా ఖర్చుల కింద వందలాది రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఇదంతా తుంగతుర్తి,నాగారం,అర్వపల్లితో పాటు వివిధ మండలాల నుంచి ప్రభుత్వం ద్వారా ఉజ్వల,మహిళా సంఘాలతో పాటు వివిధ పథకాల కింద ఉచితంగా గ్యాస్ అందుకున్న వినియోగదారుల దుస్థితి.
ప్రభుత్వం వందలాది మంది పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది. ఈ మేరకు తుంగతుర్తికి 50 కి.మీదూరంలో ఉన్న మోత్కూరు మున్సిపాలిటీలో ఉన్న భారత్ గ్యాస్ కేంద్రం నుండి ఒక్కొక్క ప్రాంతానికి నిర్ణయించిన సమయం ప్రకారం వాహనాల ద్వారా పంపిణీ జరుగుతుంది. ఉదాహరణకు:ప్రతి శుక్రవారం మోత్కూరు నుండి వాహనం ద్వారా తుంగతుర్తికి గ్యాస్ వస్తుంది. ఈ మేరకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వినియోగదారులు అతి కష్టం మీద తుంగతుర్తికి వచ్చి చివరికి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఈ లెక్కన ఇదే పరిస్థితి మిగతా మండలంలో కూడా ఉంది.
ఇంతవరకు ఒక రకంగా ఉంటే.. గ్యాస్ కనెక్షన్ కి కేవైసీ చేయించాలంటే మరిన్ని కష్టాలు తప్పడం లేదు. తుంగతుర్తితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు వందలాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రైవేటు వాహనాల ద్వారా మోత్కూరు ప్రాంతంలో ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళుతున్నారు. అక్కడ కూడా వినియోగదారుల రద్దీతో పాటు సర్వర్ ప్రాబ్లం లాంటి సంఘటనలతో పనులు పూర్తి కావడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. కొంతమంది అయితే దీనికోసం రెండు మూడు రోజులు తిరగాల్సి వస్తుంది.
కలగానే మారిన భారత్ గ్యాస్ ఏజెన్సీ
నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో భారత్ గ్యాస్ సరఫరా ఏజెన్సీ కార్యాలయ ఏర్పాటు కలగానే మారుతుంది. దీన్ని ఏర్పాటు చేస్తామంటూ గతంలో అధికారులు,ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చిన ఫలితం లేదు. ముఖ్యంగా భారత్ గ్యాస్ సిలిండర్లు అందుకోవాలంటే వినియోగదారులు నరకయాతన పడాల్సి వస్తోంది. గ్యాస్ సిలిండర్ల సరఫరా చేసే వాహనం ప్రతి శుక్రవారం తుంగతుర్తికి వస్తుందని సంబంధికులు చెబుతున్నప్పటికీ ఎన్ని గంటలకు వస్తుందో..? తెలియని పరిస్థితి వినియోగదారుల్లో నెలకొంది.ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల నుండి వినియోగదారులు ఉదయమే తుంగతుర్తికి వచ్చి మధ్యాహ్నం వరకు వేచి చూస్తున్నారు. చివరికి ఒక్కొక్కసారి వాహనం రాకపోవడంతో తిరిగి వెళుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య తుంగతుర్తిలో గ్యాస్ సిలిండర్ల నిల్వ షెడ్ ఏర్పాటు చేయాలని వినియోగదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనివల్ల అనేక ప్రాంతాల వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే తుంగతుర్తిలో ఇండేన్ గ్యాస్ సరఫరా డిపో ఏర్పాటయిందని వారంతా ఉదాహరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇండేన్ గ్యాస్ కలెక్షన్ కి కేవైసీ చేయించడానికి ఏర్పడుతున్న పలు ఇబ్బందులతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు వందలాదిమంది ఉదయం నుండే తుంగతుర్తిలోని ఆ కార్యాలయానికి వస్తున్నారు. అయితే సర్వర్ ప్రాబ్లంతో సాయంత్రం వరకు కూడా వారంతా చెట్ల నీడనే వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.