కేసీఆర్ కుటుంబం జైలుకే : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ధనిక రాష్ట్రాన్ని 9 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన కేసీఆర్ కుటుంబం రాబోయే రోజుల్లో జైలు కూడు తినక తప్పదని భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

Update: 2024-05-04 16:00 GMT

దిశ, మర్రిగూడ: ధనిక రాష్ట్రాన్ని 9 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన కేసీఆర్ కుటుంబం రాబోయే రోజుల్లో జైలు కూడు తినక తప్పదని భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం నాంపల్లి మండల కేంద్రంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని, లక్షల కోట్ల అప్పులు చేసి కాళేశ్వరాన్ని కమిషన్లకే పరిమితం చేశాడని ఆరోపించారు. లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు జైలుకు వెళ్లక తప్పదని, కవిత రాబోయే బతుకమ్మ పండుగను జైల్లోనే ఆడుతారని ఆయన ఎద్దేవా చేశారు.

సంవత్సరం క్రితం మునుగోడు గడ్డపైన ఒక యుద్ధం జరిగిందని, ఆ యుద్ధంలో 500 కోట్ల రూపాయలు నిధులు తెప్పించి తాను విజయం సాధించానని అదే స్ఫూర్తితో చామల కిరణ్ కుమార్ రెడ్డిని నాలుగు లక్షల మెజార్టీతో గెలుస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.చామల గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని మునుగోడులో లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 100 రోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిని పరుగులు పెట్టించారని, రాబోయే కాలంలో ఇచ్చిన హామీలతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

10 ఏండ్లు పరిపాలించిన కేసీఆర్ కు 100 రోజులు ఓపిక లేకుండా అవాకులు చవాకులు పేలుతున్నాడని ప్రజలందరూ గమనిస్తున్నారని, మే 13 తారీకున ఓటుతో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ లుచ్చా పనులు చేస్తేనే ప్రజలు తన్ని తరిమివేశారని సభలో ఒక వ్యక్తి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నస్తే చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ బిజెపి పార్టీ వస్తే ఎస్సీ ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు తీసేయాలని చూస్తుందని ప్రజలంతా గమనించి సుస్థిర పాలన అందించే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తీసుకువచ్చి భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాలని పేర్కొన్నారు.

ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ మధుయాష్కి మాట్లాడుతూ దేశానికి సుస్థిర పాలన అందించే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా కార్యకర్తలు గొర్రె పిల్లలను ,చాప పిల్లలను చామలకు రాజన్న కి బహుకరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ పున్నకైలాస్, నాంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, మర్రిగూడ, నాంపల్లి జెడ్పిటిసిలు ఏవి రెడ్డి ,పాశం సురేందర్ రెడ్డి నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్రావు, , కాంగ్రెస్ పార్టీ నాయకులు పూల వెంకటయ్య, కొమ్ము బిక్షం, రఘుపతి రెడ్డి, గఫార్ కుంభం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారీ క్రేన్ తో పూలదండ బహుకరణ

నాంపల్లి మండలానికి ప్రచారం నిమిత్తం వచ్చిన భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఇన్చార్జి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాంపల్లి నాయకులు భారీ క్రేనుతో పూలదండను బహుకరించారు. మహిళలు కోలాటాలతో ముస్లింలు పీర్లతో ఊరేగింపుతో స్వాగతం పలికారు.

జన జాతరగా మారిన నాంపల్లి

ప్రచారం నిమిత్తం వచ్చిన భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభకు ఊహించని విధంగా జనం అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. అంబేద్కర్ చౌరస్తా నుండి నాంపల్లి పురవీధుల ఉండగా ఎక్కడ చూసినా జనమే జనం ఉండడంతో నాయకులు కార్యకర్తలు సభ సక్సెస్ గా పరిశీలకులు పేర్కొంటున్నారు.


Similar News