దారుణం..అప్పు కట్టలేదని ఇంటికి చెప్పులు,పొరక,చాటలతో తోరణం

వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి.

Update: 2024-10-22 15:37 GMT

దిశ, సూర్యాపేట టౌన్; వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి. ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు . అవసరానికి డబ్బులు వడ్డీకి తీసుకున్న వారు సమయానికి అప్పు కట్ట లేకపోవడంతో.. సదరు వడ్డీ వ్యాపారులు కాలనాగుల కాటేస్తూ ఇబ్బందులు పేడుతున్నారు. వడ్డీ వ్యాపారుల మరో దురాగతం సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. అప్పు తీసుకొని తిరిగి చెల్లించడం లేదంటూ.. అప్పు ఇచ్చిన వారు అప్పు తీసుకున్న మహిళ ఇంటికి చెప్పులు, పొరక, పాత చేటలతో తోరణం ఏర్పాటు చేశారు . అలాగే ఇంటి ముందు పసుపు , కుంకుమ చల్లడమే కాకుండా.. ఏకంగా గ్రామంలో చాటింపు చేయించిన ఘటన ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని అస్లా తండాలో చోటు చేసుకుంది. దీంతో తన పరువు పోయిందని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..బాద్యులైన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్లా తండాకు చెందిన వాంకుడోత్ కీమా, అనిత భార్యాభర్తలు. కీమా మూడు సంవత్సరాలకు ముందు అదే తండాకు చెందిన ధరావత్ రంజా వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. కొద్ది కాలానికి అనారోగ్యంతో కీమా మృతిచెందాడు. దీంతో అనిత బతుకు దేరువు కోసం హైదరాబాద్ వెళ్ళింది. తమ డబ్బులు ఇవ్వాలని రంజా అనితను అడుగుతున్న ఇవ్వకపోవడంతో..ఇటీవల రంజా కుటుంబ సభ్యులు అనిత ఇంటికి పాత చెప్పులు పోరక , పాత చాటలను దండగ కూర్చి తోరణంగా కట్టారు. అనంతరం అనిత తమ అప్పు చెల్లించడం లేదని గ్రామంలో ఎవరు తనకు అప్పు ఇవ్వవద్దని డప్పు చాటింపు చేయించారు. ఈ విషయాన్ని గ్రామస్తులు హైదరాబాదులో ఉన్న అనితకు సమాచారం ఇవ్వగా ఆమె సోమవారం స్థానిక పోలీసులను ఆశ్రయించిoది. తన ఇంటికి చెప్పుల దండలు వేసి ఊర్లో డప్పు చాటింపు చేయడంతో.. తాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నానన్నారు. భర్త చనిపోవడంతో బతుకు తెరువు కోసం హైదరాబాదు వెళ్లి బతుకుతున్నానని.. కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంజా తో పాటు ఏడుగురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రత్నావత్ శంకర్ నాయక్ తెలిపారు.


Similar News