విచిత్రంగా మారిన సూర్యాపేట ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి

తలాపున” ఆర్టీసీ బస్సు డిపో ఉన్నప్పటికీ తుంగతుర్తి మండలంలోని వివిధ గ్రామాల ప్రజానీక సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావడం లేదు.

Update: 2024-10-22 13:22 GMT

దిశ,తుంగతుర్తి: “తలాపున” ఆర్టీసీ బస్సు డిపో ఉన్నప్పటికీ తుంగతుర్తి మండలంలోని వివిధ గ్రామాల ప్రజానీక సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావడం లేదు. ప్రయాణికుల సంక్షేమమే తమ ధ్యేయమనే ఆర్టీసీ నినాదం గాల్లోకే పరిమితమైందని స్థానికులు తెలిపారు. ప్రధాన రూట్లో బస్సులు తిప్పండి బాబో..అంటూ మొత్తుకున్నా తమకేమీ సంబంధం లేదనే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని వాపోయారు. ఒకవేళ వినిపించిన దాటవేత ధోరణి..! మీది మీదే..మాది మాదే..అన్నట్టుగా తుంగతుర్తి మండలంపై సూర్యాపేట ఆర్టీసీ డిపో వైఖరి కొనసాగుతోంది. కొత్తగా బస్సులు వేయడం ఒక ఎత్తు అయితే...? ఉన్న బస్సులను రద్దు చేయడం సూర్యాపేట ఆర్టీసీకి అలవాటుగా మారింది. ఈ పరిణామంతో తుంగతుర్తి,అర్వపల్లి, నూతనకల్ మండలాలతో పాటు..పక్కనే ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజానీకం ఆర్టీసీ అధికారులపై “గుర్రు” మంటోంది.

అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తి నుంచి హనుమకొండ,ఖమ్మం జిల్లా కేంద్రాలకు ఉదయం- సాయంత్రం వేళల్లో వెళ్లాలంటే..అనేక గ్రామాల ప్రజానీకానికి ఆర్టీసీ సేవలు అత్యంత అనివార్యం. దీనికి తోడు సాయంత్రం వేళల్లో హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సు సర్వీసు నడపడం మరో ప్రధాన అంశం. ఎందుకంటే తుంగతుర్తి మండలంలోని 24,అర్వపల్లి,నూతనకల్ మండలాలలోని ఆరేడు, పక్కనే సరిహద్దుల్లో ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు విద్య-వైద్యం-వ్యాపారం-తదితర అంశాల పరంగా ఖమ్మం,హనుమకొండ,హైదరాబాద్ ప్రాంతాలను నిత్యం ఆశ్రయిస్తుంటారు.

గతంలో ఉన్న బస్సులు రద్దు చేసి...

సూర్యాపేట డిపో నుంచి అర్వపల్లి,తుంగతుర్తిల మీదుగా గతంలో ఉదయం-సాయంత్రం వేళల్లో హనుమకొండ, నూతనకల్ మండలం చిల్పకుంట్ల మీదుగా సాయంత్రం వేళలో హైదరాబాదుకు బస్సు సర్వీసులు నడిచేవి. అయితే వీటిని అధికారులు అర్ధాంతరంగా రద్దు చేశారని స్థానికులు ఆరోపించారు. అలాగే వీటిని పునరుద్ధరించాలంటూ ఆయా ప్రాంతాల ప్రజానీకం ఎన్నో మార్లు ఆర్టీసీ అధికారులకు వివిధ రకాలుగా విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం శూన్యం. పైగా వారి నుంచి పొంతన లేని సమాధానాలు. మీ సమస్యలతో మాకేంది.? అంతా మా ఇష్టమే అనే విధంగా ఉందని ప్రజానీకం పేర్కొంటుంది. సూర్యాపేట ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి విచిత్రంగా మారింది.తుంగతుర్తి-సూర్యాపేట ప్రాంతాల మధ్య నడిచే బస్సులను చీటికి మాటికి రద్దు చేయడం ఆనవాయితీగా మారింది. కొన్ని సార్లు ఒకే ఒక బస్సు,మరికొన్ని సార్లు రెండు బస్సులు నడిపించడం విచిత్రంగా మారింది. పండుగలు,పబ్బాలు,ఫంక్షన్లు ఇలా ఏది వచ్చినా నడిచే బస్సుల్లో ఏదో ఒకటి రద్దు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల ఏ బస్సు ఎప్పుడొస్తుందో..ఎప్పుడు పోతుందో...! తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు వెంటనే స్పందించి ప్రధాన రూట్ లలో రద్దు చేసిన బస్సులను తిరిగి పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Similar News