దిశ, జనగామ : జనగామలో రంగప్ప చెరువు, బతుకమ్మ కుంట అంటే తెలియని నాథుడు లేరు. రంగప్ప చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని చెరువు శిఖం రక్షణకు, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పలుసార్లు సూచించిన పట్టించుకునే నాధుడే లేరు. పురపాలక శాఖ సంచాలకులు ఆదేశించినా కాగితాలకే పరిమితమయ్యాయి. అప్పుడు హల్ చల్ చేసిన ఆపైన గప్ చూప్ గా ఉండిపోయారు. జిల్లా కేంద్రంలోని ఏకైక రంగప్ప చెరువు చాలా ప్రత్యేక మైనది.రెవెన్యూ రికార్డులను అనుసరించి మొత్తం
32.18 ఎకరాల శిఖంతో విస్తరించి ఉందని ప్రాధమిక అంచనా. చెరువు శిఖం ఆక్రమణకు గురైందనే ఫిర్యాదులపై గతంలో హల్చల్చేసి వదిలేశారు. ఈ చెరువుకు శామీర్ పేట నుంచి వచ్చే వరద ప్రవాహ మార్గంలోను, చెరువు కట్ట చుట్టు, పరిసరాల్లో చెరువు నిండితే నీరు నిలిచే పలు ప్రాంతాల్లో, ఎఫ్ టీ ఎల్ పరిధిలోని పట్టాలు క్రయ విక్రయాలు జరిగాయి. కమిషన్లకు కక్కుర్తి పడి దళారులు చేసిన మోసానికి వందలమంది బ్రమపడి కొన్నవారు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు బపర్ జోన్ సమస్య వెంటాడుతుంది. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అసలు ఎంత పరిది రంగప్ప చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ కింద 462, 462/1/2, బీ/1, బీ/2, సీ/1, సీ/2, డీ/1, డీ/2, ఈ/1, ఈ/2తో పాటు 442,443, 444, 445, 461 సర్వే నంబర్లలో సుమారు 42 ఎకరాలకు కొంచెం అటు ఇటుగా భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో 443, 444, 445 సర్వే నంబర్లలో 32.18 ఎకరాలు, 462 సర్వే నంబర్ 4.37 ఎకరాలు, 461 సర్వే నంబర్ 3.34 ఎకరాలు, 442 సర్వే నంబర్లో 2.10 ఎకరాలు ఉంది. ఇదే చెరువు శామీర్ పేట వరకు 151, 218, 219, 220 సర్వే నంబర్ల పరిధిలో విస్తరించి ఉంది. కాగా చెరువు రికార్డుల నుంచి తొలగించినట్లుగా ఆరోపణలు వస్తున్నా 463 సర్వే నంబర్ పరిధిలో 463/ఏ కింద వేర్వేరుగా ఎంత భూమి ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చెరువు పరిధిలో 32 నుంచి 48 ఎకరాల భూమి ఉండొచ్చని అంచనా...
రంగప్ప చెరువు పరిసర ప్రాంతం అక్రమాలకు గురైనట్టుగా మా దృష్టికి వచ్చింది.ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మాకు ఉన్న సర్వే నెంబర్ల ఆధారంగా ఒక ప్రణాళిక ఆధారంగా అంచనా వేసినం.. ముందు ముందు ఇరిగేషన్ అధికారులతో సంప్రదింపులు జరిపి ఏకకాలంలో ఆ ప్రదేశంలో ఇల్లు నిర్మించుకున్న ఇంటి యజమానులను సైతం దీనిలో భాగస్వాములను చేస్తూ పూర్తి దర్యాప్తు చేసి పై అధికారులకు నివేదిక అందిస్తాం..
-జనగామ తహసిల్దార్ వెంకన్న