ఫోన్ ట్యాపింగ్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదు.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎటువంటి సంబంధం లేదని
దిశ, నార్కట్ పల్లి : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎటువంటి సంబంధం లేదని ట్యాపింగ్ చేయడానికి నేను హోం మంత్రిని, డీజీపీని కాదన్న విషయం గ్రహించుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడే లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పోలీస్ విచారణ అనంతరం విలేకరులతో ఈ విధంగా మాట్లాడారు. రామన్నపేట మండలం లో రేవంత్ రెడ్డి మిత్రుడు ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నందుకు తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన నువ్వు నాపై కేసులు పెట్టేది అంటూ హెచ్చరించారు. పరిపాలన చేయడం చేతగాక ప్రతిపక్షాలపై పోలీసు వ్యవస్థను వాడుకొని కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన మంత్రి వర్గం ఎమ్మెల్యేలపై నమ్మకం లేక సీటును కాపాడుకునేందుకు వారి ఫోన్లు టాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇతరుల ఫోన్లో టాపింగ్ చేసే అవసరం నాకు లేదన్నారు. ఫార్మా కంపెనీ వద్దన్నందుకు రైతులను నేరస్తుల జైలుకు పంపించడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్రం ఏటీఎం గా మారిందన్నారు. ప్రజా పాలన అని చెప్పి పేద కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని పోలీసుల పాలన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ధాన్యాన్ని పత్తిని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్ని కేసులు పెట్టుకున్న ప్రజల పక్షాన పోరాడుతానని నా పోరాటం ఆగదు అన్నారు.