యాదాద్రి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు..
యాదాద్రి భువనగిరి జిల్లాలో వైద్య విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలో వైద్య విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాదాద్రిలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో కీలక అడుగు ముందు పడింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానకు అనుబంధ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిపాలన అనుమతులు జారీ చేస్తూ జీవోను విడుదల చేసింది.100 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది.
కళాశాల ఏర్పాటుకు జీవో రావడంతో జిల్లా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. జిల్లాకు మెడికల్ కాలేజీ రానుండటంతో అన్ని రకాల సేవలు అందనున్నాయి. మెడికల్ కాలేజీలతో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందుతాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు కలుపుకొని, మొత్తం 35 వైద్య విభాగాల సేవలు అందే అవకాశముంది. అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్స్ ఉంటాయి. డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు.