కరెంట్ షాక్‌తో రైతు మృతి
భూమిలో సిరులు పండించి నలుగురికి అన్నం పెట్టే ఓ రైతు ధాన్యాన్ని అమ్ముకునేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.
దిశ, మునగాల : భూమిలో సిరులు పండించి నలుగురికి అన్నం పెట్టే ఓ రైతు ధాన్యాన్ని అమ్ముకునేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని తాడువాయి గ్రామానికి చెందిన చిర్ర సైదులు (54) తాను పండించిన పంటను తాడువాయి సొసైటీ ఆధ్వర్యంలో.. కలకోవ స్టేజి సమీపాన శివ సాయి మిల్లు ఆవరణలో దొడ్డు రకం ధాన్యాన్ని ఆరబెట్టేందుకు వెళ్లాడు. ట్రాక్టర్ తో ధాన్యాన్ని అన్లోడ్ చేసేందుకు హైడ్రాలిక్ తో ట్రక్కును పైకి లేపడంతో..ప్రమాదవశాత్తు పైన ఉన్న 11 కెవి విద్యుత్ తీగలు ట్రక్కుకు తగిలాయి. దీంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం కావడంతో ట్రాక్టర్ పై ఉన్న సైదులు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.