పాలకులు మారినా ఆగని ఇసుక దందా.. కళ్లుండి చూడలేని అధికారులు!

పాలకులు మారినా.. సహజ సంపద దోపిడీ ఆగలేదు. కోట్ల విలువ చేసే ఆ సంపదను అనుమతి పేరుతో కొల్లగొట్టేస్తున్నారు.

Update: 2024-06-25 02:51 GMT

దిశ నల్లగొండ బ్యూరో: పాలకులు మారినా.. సహజ సంపద దోపిడీ ఆగలేదు. కోట్ల విలువ చేసే ఆ సంపదను అనుమతి పేరుతో కొల్లగొట్టేస్తున్నారు. ఇసుక మాఫియా కు అడ్డుకట్ట వేస్తామని చెప్పిన పాలకులు ప్రస్తుతం ఇసుక వ్యాపారులతో చేతులు కలిపారని ఆరోపణలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇసుకను కాపాడాల్సిన అధికార యంత్రాంగం సంబంధిత శాఖల అధికారులు ఇసుక వ్యాపారులతో కుమ్మక్కై మూడు పువ్వులు ఆరు కాయలుగా దంధాలు కొనసాగిస్తున్నట్లు పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది.

మంచి భూసారం కలిగిన భూమిలో బంగారం పంట పండుతుందంటే నమ్ముతారో లేదో కానీ.... ఇక్కడి భూముల్లో మాత్రం ప్రస్తుతం బంగారం కంటే విలువైన ఇసుకను దోచుకోవడానికి కొద్ది మంది దొంగలు బయలుదేరారు దొంగలతో చేతులు కలిపిన నాయకులు ముడుపుల రూపంలో వారికి కావాల్సిన ముడుపులు తీసుకుని , గుట్టు చప్పుడు కాకుండా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం.

అక్కడి నుంచే ఇసుక దందా..!

అర్వపల్లి,శాలిగౌరారం పరిధిలోని వంగమర్తి ఇసుక రీచ్ నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇసుకను రీచ్ నుంచి వందల లారీల ఇసుక హైదరాబాద్ నగరానికి తరలి వెళ్తుంది. వాస్తవంగా ఇక్కడి నుంచి దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం అనుమతి తీసుకున్నారు. కానీ ఈ అనుమతి ఆధారంగా ఒక్క లారీ విద్యుత్ ప్లాంట్ కోసం ఇసుక తరలిస్తే పదుల సంఖ్యలో లారీల ఇసుక బయటికి వెళుతుంది. ఒక లారీకి వే బిల్లు తీసుకొని వందలాది లారీలు ఆ పేరు తోటి ఇసుక దందా చేస్తున్నట్లు బహిరంగ రహస్యమే.

ఇదిలా ఉంటే గత నాలుగైదు రోజులుగా వే బ్రిడ్జిలలో తూకం వేయకుండానే, బిల్లులు లేకుండానే పెద్ద లారీలతో ఇసుకను తరలిస్తున్నారు. వే బ్రిడ్జి దగ్గరకు వెళ్లకుండానే లారీలలో ఇసుకను తరలిస్తున్నారు. నాగారం మండలం పేరబోయిన గూడెం నుంచి కూడా రోజు వందల ట్రాక్టర్లు ఇసుకను రవాణా చేస్తూ వేలాది రూపాయలు అక్రమార్జన చేస్తున్నట్లు వినికిడి.

కళ్ళుండి చూడలేని అధికారులు..

ఇసుక తవ్వకాలు నేరం అని అధికార యంత్రాంగానికి తెలిసినప్పటికీ ఆ దందాలో వీళ్లంతా భాగస్వాములు అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళ్ళ ముందు నుంచే వందలాది లారీలు ఇసుక రవాణా చేస్తుంటే రెవెన్యూ , మైనింగ్ , పోలీస్ అధికారులకు ఇవేమీ కనిపించట్లేదు. ఇసుక రీచ్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నుంచి అధికారులకు ప్రతినెలా మామూళ్లు అందుతున్నాయని ఆరోపణలు న్నాయి. అందుకే 24 గంటలు వాగులో ఇసుక తవ్వకాలు రవాణా జోరుగా సాగుతుంది. సహజ సంపదను దోచుకోవడం తప్పు అని తెలిపిన వ్యక్తులపైనే బెదిరింపులు అక్రమ కేసులు బనాయిస్తారని విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి.

అన్నదాత ఒక గుండె కోత..

లారీలకొద్దీ ఇసుకను తవ్వేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దాంతో రైతులు సాగు చేసుకునే పంట పొలాలకు నీరందడం లేదు. పంటలు లేకపోతే తిండి కూడా కరువైతుందని రైతన్నలకు బోరున విలపిస్తున్నారు. అన్నదాతల కడుపుకొట్టి ఇసుక దందా వ్యాపారులు కోట్లు గడిస్తుంటే పాలకులు అధికారులు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పద్ధతుల్లో వ్యవహరిస్తూ జేబులు నింపుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మా ముళ్ల మైకంలో ఉన్న అధికారులకు రైతుల గోడు పట్టడం లేదని బహిరంగంగానే చర్చ జరుగుతుంది.

గత ప్రభుత్వం ఇసుక రీచ్‌లకు అనుమతి ఇవ్వడం వల్ల ఇంకా ఇసుక తరలింపు జరుగుతుందని చెబుతున్న ప్రజాప్రతినిధులు తమ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఇసుక తరలింపును నిలిపివేసేలా ఎందుకు ఉత్తర్వులు తీసుకురావడం లేదని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇసుక తరలింపును ఆపకపోతే ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకు కూడా ఇందులో వాటా ఉండే అవకాశం ఉందని భావించాల్సి వస్తుంది.


Similar News