అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ : ఈటల రాజేందర్
ప్రజలను మభ్యపెట్టి.. అబద్ధపు హామీలించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు.
దిశ, హుజూర్ నగర్ : ప్రజలను మభ్యపెట్టి.. అబద్ధపు హామీలించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణంలో ఉమ్మడి వరంగల్,ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బోబ్బా భాగ్య రెడ్డి కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12సీట్లు తగ్గకుండా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పార్టీలకు ఓటు వేయాలా వాటిని అమలు చేయాలని కొట్లాడే బీజేపీకి ఓట్లు వేయాలో ఆలోచన చేయాలన్నారు. నిరుద్యోగులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రస్తావించే శక్తి ప్రేమేందర్ రెడ్డికే ఉందన్నారు. ఆయనను ఎమ్మెల్సీగా గెలిపిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. అన్ని ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్న బిడ్డగా ఎన్నికల్లో అన్ని సంఘాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.
అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరు గ్యారెంటీ హామీల్లో ఉచిత బస్ హామీ తప్ప మిగిలినవి అమలు చేయలేదని అన్నారు. సంక్షేమం, మౌలిక వసతులు కల్పనలో కాంగ్రెస్ పార్టీ కుంటుపడింది అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ లేని పార్టీగా పేర్కొన్నారు. సమస్యల మీద పోరాటం చేసే పార్టీ బిజెపి పార్టీయే అన్నారు. నిరుద్యోగులు పట్టభద్రులు ఆలోచించి బిజెపి అభ్యర్థి అయిన ప్రేమేందర్ రెడ్డి కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బిజెపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్ల శ్రీలత రెడ్డి బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు బాల వెంకటేశ్వర్లు అంబాల నరేష్ చింతకుంట్ల సోమిరెడ్డి పాల్గొన్నారు.