మీ ఆత్మ సాక్షిగా నైతిక ఓటు వేయాలి
నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ… ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదే అని, కుల, మత, లింగ భేదం తేడా లేకుండా రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించిందని అన్నారు.
దిశ, నల్లగొండ: నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ… ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదే అని, కుల, మత, లింగ భేదం తేడా లేకుండా రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించిందని అన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకున్ని ఎన్నుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు. పలాన వారికి వేయాలని ఎవరో చెప్తే మీరు ఓటు వేయొద్దని, మీ ఆత్మ సాక్షిగా నైతిక ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణంలో నైతిక ఓటింగ్ పై నాగార్జున కళాశాల మైదానం నుంచి స్థానిక గడియారం సెంటర్ వరకు నిర్వహించిన 5కే రన్‌ను జండా ఊపి ప్రారంభించారు.
ఆమె స్థానిక గడియారం సెంటర్లో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో 85 సంవత్సరాలు నిండిన ఓటర్లకు, దివ్యాంగ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించిందని, హోమ్ ఓటింగ్ వేయాలనుకునే ఓటర్లు ఫామ్- 12 డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, లేదా సాక్ష్యం యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, పంచాయతీ సెక్రటరీలు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, పోలీసులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ 5కే రన్ కు అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్డీఏ పిడి నాగిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డాక్టర్ పుల్లారావు, డీఎస్డీఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.