పదవి లేకుండా మున్నేళ్లు తిరగలేరా ? : భువనగిరి ఎమ్మెల్యే కుంభం
ప్రజాప్రతినిధులకు అధికారాన్ని అనుభవించుడే కాదని.. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద కొట్లాడాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రజాప్రతినిధులకు అధికారాన్ని అనుభవించుడే కాదని.. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద కొట్లాడాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గానికి చెందిన ప్రతిపక్ష కీలక నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడనే వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రతిపక్ష నేత ప్రజల సమస్యలపై కొట్లాడాలని, మూడు నెలలు కూడా ఓపిక లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత గొప్పనో, ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే గొప్ప అని చెప్పారు. తాను గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయానని, కానీ 65 వేల ఓట్లు తెచ్చుకున్నానని చెప్పారు. ఓటమి పాలైన కూడా పార్టీ కార్యకర్తల్లో ధైర్యం పెంచామని, ఊరు ఊరు తిరిగి ప్రజల సమస్యలపై పోరాటాలు చేశామని గుర్తు చేశారు. అధికారం పోగానే ఓపిక లేకుండా అధికార పార్టీలో చేరాలని చూస్తున్నారంటూ చురకలు అంటించారు. ఓడిపోయిన నాయకులు పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించారు. భువనగిరి పార్లమెంట్ పై కార్యకర్తలు ఆందోళనకు గురి అవుతున్నారని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, దీపా దాస్ మున్షీని కలిసినట్లు చెప్పారు.