"100 కొట్టు మేకను పట్టు".. బంపర్ డ్రా నిర్వాహకులకు పోలీసుల నోటీసులు

త్వరలో రాబోతున్న దసరా పండుగ సందర్భంగా.. రూ 100 కొట్టు-మేకను పట్టు అంటూ బంపర్ డ్రా నిర్వహించేందుకు పలువురు పోస్టర్లు రిలీజ్ చేశారు.

Update: 2024-09-30 12:53 GMT

దిశ, మర్రిగూడ: త్వరలో రాబోతున్న దసరా పండుగ సందర్భంగా.. రూ 100 కొట్టు-మేకను పట్టు అంటూ బంపర్ డ్రా నిర్వహించేందుకు పలువురు పోస్టర్లు రిలీజ్ చేశారు. కాగా ఈ బంపర్ డ్రా పై స్పందించి.. సదరు నిర్వహకులకు సోమవారం మర్రిగూడ ఎస్ ఐ కే రంగారెడ్డి నోటీసులు జారీ చేశారు. నిర్వాహకులకు ఎస్ఐ పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాటరీ సిస్టంను తెలంగాణ ప్రభుత్వం నిషేధించిదన్నారు. దసరా పండుగకు కొంతమంది వ్యక్తులు లాటరీ పేరుతో ప్రజలను మోసం చేసే పద్ధతిలో బంపర్ డ్రాలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, వారిని గుర్తించి లెంకల పల్లి గ్రామంలో ఇద్దరికీ, మర్రిగూడ మండల కేంద్రంలో ఒకరికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. చట్ట విరుద్ధమైన పనులు ఎవరు చేసినా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని ఎస్సై హెచ్చరించారు.


Similar News