డబుల్ ఇండ్లకై ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు.. ఈ ఏడాదైనా మోక్షం కలిగేనా!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Update: 2023-03-28 03:28 GMT

దిశ, చౌటుప్పల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ ఇది క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించకపోగా అభాసుపాలు అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏండ్లు గడుస్తున్న ఏ ఒక్క లబ్ధిదారునికి ఇండ్ల కేటాయింపు జరగకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మండలానికి ఒకటి,రెండు గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన అది అంతగా విజయం సాధించలేదు. ఇండ్ల నిర్మాణం కోసం స్థల సేకరణ,నిర్మాణానికి ఏళ్లు గడిచాయి.

ఒకటి,రెండు చోట్ల నిర్మాణం పూర్తయిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. ఇండ్ల నిర్మాణం పూర్తయి మూడేళ్లు గడిచిన తర్వాత అధికారులు ఎలాగో అలా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. ఈ లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియలో కూడా అర్హుల అందరిని పరిగణలోకి తీసుకోలేదంటూ పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఇదంతా ఇలా ఉంటే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా ఇంకా కేటాయింపు జరగక పోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ ఏడాది కేటాయింపు జరిగేనా!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మార్కాపురం గ్రామంలో 72 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. వీటి నిర్మాణం పూర్తయి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కేటాయింపు జరగలేదు. అదేవిధంగా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో 64 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా రెండేళ్ల క్రితమే పూర్తి చేశారు. ఇక్కడ కూడా 60 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా ఇంకో నాలుగు ఇండ్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.

ఇక్కడ కూడా ఇంకా కేటాయింపు జరగలేదు. అదేవిధంగా మండల కేంద్రంలో 120 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు కాగా ఇది ప్రారంభ దశలోనే ఆగిపోయింది. డబుల్ ఇళ్ల పిల్లర్ల కోసం వేసిన స్టీల్ తుప్పు పట్టి విరిగి పోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇకనైనా చొరవ తీసుకొని ఎంపికైన లబ్ధిదారులకు డబుల్ ఇళ్లను కేటాయించాలని వేడుకుంటున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..

సర్వేలు, మల్కాపురం గ్రామంలో నిర్మించిన డబుల్ ఇండ్ల కేటాయింపు పూర్తి కాకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గ్రామ శివారులో డబుల్ ఇండ్లను నిర్మించడంతో రాత్రి పడితే మందుబాబులు అడ్డాగా మార్చుకున్నారు. డబుల్ ఇండ్ల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు వీలైనంత తొందరగా కేటాయింపు చేయాలని ఆశిస్తున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల డబుల్ ఇండ్ల కేటాయింపులో తీవ్ర జాప్యం ఏర్పడడంతో లబ్ధిదారులు తాళాలు పగలగొట్టి ఆక్రమించుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇలాంటివి పునరావృతం కాకముందే అధికారులు,ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని కేటాయింపులు పూర్తి చేయాలని ఆశిద్దాం.

త్వరలోనే డ్రా పద్ధతిలో కేటాయింపులు పూర్తి

మల్కాపురం గ్రామంలో 72 ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఆర్ అండ్ బి శాఖ డబుల్ ఇండ్లకు నెంబర్లు కేటాయిస్తున్నారు. త్వరలోనే డ్రా పద్ధతిలో లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తాం. వారం రోజుల లోపు పూర్తి చేస్తాం:-శ్యాంసుందర్ రెడ్డి,చౌటుప్పల్ తహశీల్దార్

Tags:    

Similar News