కలెక్టర్ మీద దాడి అమానుషం: మంత్రి
వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి ప్రతీక్ జైన్ పై దాడి సంఘటనను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు
దిశ,నల్లగొండ: వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి ప్రతీక్ జైన్ పై దాడి సంఘటనను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఒక ఐఏఎస్ అధికారిపై దాడి చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం కలెక్టర్ ను పిలిపించి దాడికి పాల్పడ్డారని ,ఇది దేశంలోనే ఘోరమైన సంఘటన అని అన్నారు. కాలేశ్వరం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ వంటి అవసరం లేని ప్రాజెక్టులకు భూసేకరణ జరిగినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగినా ప్రభుత్వాన్ని బ్రతిమిలాడారే తప్ప ఏ రోజు దాడులకు పాల్పడలేదని ,అలాంటిది ఈరోజు ఒక జిల్లా కలెక్టర్ పైన దాడికి దిగడం దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లు అందరూ ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఇది దురదృష్టకరమైన సంఘటన, ఈ సంఘటన వెనక ఎంత పెద్దవారు ఉన్నా సరే క్షమించేది లేదని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని ,ఎంతటివారినైనా వదిలిపెట్టమని అన్నారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఒక మంచి ఐఏఎస్ అధికారని, నక్సలైట్ ఏరియాలో గిరిజనులకు సేవలందించిన వ్యక్తిగా మంచి పేరు ఉందని,అలాంటి అధికారిపై ఇలా దాడి చేయడం సబబు కాదన్నారు. ఈ సంఘటనపై నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో చర్యలు చేపడతామన్నారు. ధాన్యం సేకరణపై మంత్రి మాట్లాడుతూ..కొందరు స్వార్ధపరులైన మిల్లర్లు కారణంగా ధాన్యం రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. నామమాత్రం 10% బ్యాంక్ గ్యారెంటీతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం మిల్లర్లతో చెప్పినా,మిల్లర్లు రైతులకు సహకరించకుండా ఇబ్బందులు పెడుతున్నారని, అలాంటి వారిపై అవసరమైతే S-1 కేసులు పెడతామన్నారు. సహకరించే మిల్లర్లను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇప్పటికే 60 నుండి 70% ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. పత్తి కొనుగోలుపై రైతులు ఇబ్బందులు పడుతున్నా..కేంద్ర మంత్రులు ఎవరూ ఈ విషయంపై మాట్లాడంలేదని మంత్రి తెలిపారు.