ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి వడివడిగా అడుగులు..

యాదాద్రి భువనగిరి జిల్లా‌ పరిధిలో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి వేగవంతంగా భూసేకరణ పనులు జరుగుతున్నాయి.

Update: 2024-10-23 09:09 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా‌ పరిధిలో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి వేగవంతంగా భూసేకరణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి భువనగిరి పరిధిలో ఎన్హెచ్‌ఎఐ త్రీజీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో భూసేకరణ దాదాపు పూర్తి అవుతుంది. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తర భాగంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 50.65 కిమీ పొడవున ఈ రహదారి వెళుతుంది. ఈ నెల 25 నుంచి భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో రైతులతో సమావేశాలు అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలను బహిష్కరిస్తామని బాధిత రైతులు పేర్కొంటున్నారు.

సుమారు 2 వేల ఎకరాల భూమి..

ట్రిపుల్ ఆర్ నిర్మాణం కోసం యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల భూమిని సేకరించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉత్తర పరిధిలో 50.65 కిమీ పొడవున ఈ రహదారి వెళ్లనుంది. దీంట్లో తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాలు ఉన్నాయి. భువనగిరి మండల పరిధిలోని గౌస్ నగర్, కేసారం, ఎర్రంబెల్లి, తుక్కాపురం, పెంచికల్ పహాడ్, రాయిగిరిలో 15 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం 328 సర్వే నెంబర్లలో 170.53 ఎకరాలను సేకరించేందుకు రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈనెల 25న గౌస్ నగర్, కేసారం, 26న ఎర్రంబెల్లి, 28న తుక్కాపురం, 29న పెంచికల్ పహాడ్, 30న రాయిగిరి రైతులతో భువనగిరి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అవార్డు ఎంక్వైరీని నిర్వహించనున్నారు.

హై కోర్టు స్టే ఎత్తేయడంతో..

భువనగిరి పరిధిలో పలు గ్రామాలలో త్రిబుల్ ఆర్ నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ భూ సేకరణ విషయంలో హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈ ప్రక్రియకు విరామం ఏర్పడింది. అయితే ఇటీవల హైకోర్టు స్టేను ఎత్తేయడంతో భూ సేకరణ ప్రక్రియ వేగవంతం అయింది. కాగా త్రీజీ నోటిఫికేషన్ గందరగోలంగా ఉందని భూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో స్పష్టంగా ఎవరెవరు భూములు కోల్పోతున్నారో పొందుపర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవార్డు ఎంక్వయిరీని బహిష్కరిస్తాం : భాదిత రైతులు..

తమ గ్రామాల నుంచి ఇప్పటికే మూడు సార్లు వివిధ ప్రాజెక్టుల కోసం తమ భూములను అందించామని, మరోసారి ఈ ప్రాజెక్టు కోసం భూములను అందించే ప్రసక్తి లేదని బాధిత రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను మారుస్తామని మాట ఇచ్చిందని, ఆ మాటను నిలబెట్టుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అలైన్మెంట్ మార్చేంతవరకు అవార్డు ఎంక్వైరీ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని బాధిత రైతులు పేర్కొంటున్నారు. ఈ అలైన్మెంట్ మార్పు కోసం ఇప్పటికే కేంద్రమంత్రులు నితిన్ గట్కారి, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులను కలిసి తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూసేకరణకు సహకరించబోమని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన అలైన్మెంట్ మార్పు హామీని నిలబెట్టుకోవాలని ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు.


Similar News