బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే సామేలు

మూసీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు చెప్పుకుంటున్న రూ.25 వేల కోట్లు ఎక్కడికెళ్లాయి..? ఎవరు మింగారని...? తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Update: 2024-10-23 09:57 GMT

దిశ,తుంగతుర్తి: మూసీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు చెప్పుకుంటున్న రూ.25 వేల కోట్లు ఎక్కడికెళ్లాయి..? ఎవరు మింగారని...? తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూసిలో ఏనాడు కూడా తట్టెడు మట్టి తీయని బీఆర్ఎస్ పార్టీ నేతలైన కేటీఆర్,హరీష్ రావులు నేడు విడ్డూరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మంజూరైన 39 ట్రై సైకిళ్లను బుధవారం దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో సామెల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నేతల తాతమ్మలు, జేజమ్మలు దిగొచ్చిన మూసి ప్రక్షాళన జరిగి తీరుతుందని పునరుద్ఘాటించారు.40 ఏళ్ల క్రితం మూసీ వాగు ఇసుకల్లో మంచినీళ్లు తాగితే..నేడు అందులో నుంచి నడిచే వారి కాళ్లకు బొబ్బలు వచ్చి రోగాల పాలవుతున్నారని వివరించారు. మూసి ప్రక్షాళనలో దాని పరిధిలో ఉన్న వారందరికీ ప్రభుత్వం పునరావాసాలు కల్పిస్తుందని అన్నారు. చివరికి ఏ పేదోన్ని కూడా రోడ్డున పడేయమని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి స్మశానాలు,బొందల గడ్డలనే అభివృద్ధి చేసిందన్నారు. ముఖ్యంగా మీరు చేస్తే అభివృద్ధి-మేం చేస్తే విమర్శలా... అంటూ ఆయన బీఆర్ఎస్ నేతలను వ్యంగ్యంగా చమత్కరించారు. అలాగే నియోజకవర్గానికి వచ్చిన 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లను వచ్చే నెలలో అర్హులైన వారందరికీ పంపిణీ చేస్తామన్నారు. మండల కేంద్రంలో ఆగిపోయిన వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను త్వరలోనే పునరుద్ధరిస్తామని తెలిపారు. తుంగతుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఐటిఐలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని కొత్తగూడెం గ్రామం వద్ద సర్వే నెంబర్ 10 లో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ భూమిలో 15వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మిస్తున్నట్లు తెలిపారు. వికలాంగుల పట్ల నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఒక్కరు మానవీయ కోణంతో చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వికలాంగులు కూడా శక్తి మేరకు ఎవరికోసం ఎదురు చూడకుండా స్వశక్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు,స్త్రీ శిశు సంక్షేమ శాఖ తుంగతుర్తి ప్రాజెక్ట్ అధికారి శ్రీజ,ఎంపీడీవో శేషు కుమార్, తుంగతుర్తి రైతు సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు, పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, ఉపాధ్యక్షులు చింతకుంట్ల వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.


Similar News