అడ్డుకోవడానికి చివరి వరకూ ప్రయత్నిస్తాం.. జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఏర్పాటు కాబోతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ(Ambuja Cement Factory)ని అడ్డుకోవడానికి చివరి వరకు ప్రయత్నం
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఏర్పాటు కాబోతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ(Ambuja Cement Factory)ని అడ్డుకోవడానికి చివరి వరకు ప్రయత్నం చేస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ప్రకటించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రామన్నపేట(Ramannapet)లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టకుండా చివరి వరకు అడ్డుకుంటామని అన్నారు. ఇప్పటికే ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు అభిప్రాయం చెప్పారని గుర్తుచేశారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ను అరెస్టు చేశారని తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట మండలం కకావికలం అవుతుందని చెప్పారు. అదానీ ఆధ్వర్యంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని చూస్తున్నారు. ఫ్యాక్టరీ వస్తే మండలంలో పశువులకు గడ్డి కూడా దొరకదని అన్నారు.
అవసరం అయితే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు కడుతుంటే అడ్డం పడ్డ కోదండరాం ఎందుకు మాట్లాడటం లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఒక్క అంశం మీదే కాదని.. మూసీ విషయంలోనూ కోదండరాం మౌనంగా ఉన్నారని.. ఆయనతోపాటు ప్రొఫెసర్ హరగోపాల్ కూడా నోరుమెదపడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవులు ఆశించే మేధావులు మాట్లాడటం లేదా? అని ప్రశ్నించారు. నల్లగొండ ప్రజలు విషం తాగుతున్నారని మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. రామన్నపేటకు సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు తీసుకొస్తున్నారని అడిగారు. మోడీకి బీ-టీమ్‌గా కాంగ్రెస్ పనిచేస్తోందని ఆరోపించారు.