యథేచ్ఛగా బెల్ట్ షాపుల దందా
గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.
దిశ, మాడుగులపల్లి : గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పచ్చని పల్లెలు మద్యం మత్తులో ఊగుతున్నాయి. పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. సీఎం ఆదేశించిన, ప్రభుత్వం బెదిరించిన తమకు మాత్రం ధనార్జనే ముఖ్యమనే చందంగా మద్యం వ్యాపారులు ముందుకు సాగుతున్నారు. వైన్స్ లో దొరకని బీర్లు బెల్టు షాపుల్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు దాడులు చేయకపోవడంతో..ప్రజలు పెదవి విరుస్తున్నారు. వారి ఆదాయం కోసం గ్రామాల్లో బెల్ట్ షాపులను విచ్చలవిడిగా పెంచేసి మద్యం అమ్మకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మాడుగులపల్లి మండలలో మూడు వైన్స్ షాప్ లు ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు దారులు అవసరాలను ఆసరాగా చేసుకొని బెల్ట్ షాపుల నిర్వహణకు తెరలేపారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మాడుగులపల్లి మండలంలో 28 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామానికి 10 నుంచి 20 చొప్పున బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అయినా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మండలంలో రెండు లైసెన్స్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా అమ్మకాలు జరగాల్సి ఉండగా..వాటి ద్వారా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని బెల్ట్ షాప్ నిర్వహకులు గ్రామాల్లోని బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసుకుంటున్నా రు. దీంతో గ్రామాల్లో రోజులో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండడంతో తాగే వారి సంఖ్య పెరిగిపోయింది. బెల్టు షాపులు ఇళ్ల మధ్యలోనే ఉండడంతో మహిళలకు బయట తిరిగేందుకు ఇబ్బందిగా మారిందని ప్రజలు వాపోతున్నారు .బెల్టు షాపు నిర్వాహకులు ఒక్కొక్క కోటర్ బీర్ బాటిల్ పై 30 నుండి 50 రూపాయల వరకు అదనంగా దండుకుంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా బెల్డు షాప్ లు నడపడంతో..చుట్టుపక్కల ఉన్నవారికి ఇబ్బందిగా ఉంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.