సూర్యాపేట జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అనురాధ
సూర్యాపేట జిల్లా మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తిరుమలప్రగడ అనురాధ కిషన్ రావు నియమితులయ్యారు.
దిశ,తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తిరుమలప్రగడ అనురాధ కిషన్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు,ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు సునీతా రావు మొగిలి ఉత్తర్వులు జారీ చేశారు.తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన అనురాధకు ఈ పదవి వరించడం రెండోసారి. 2021లో తొలిసారిగా ఆమె జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్న కోదాడ,హుజూర్ నగర్,సూర్యాపేట,తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలలో మహిళా సభ్యత్వాల సేకరణలో అగ్రపతంలో కొనసాగారు.ఆమె సేవలకు రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా గత ఏడాది ఎంపికై ఢిల్లీలో అవార్డు పొందారు.ముఖ్యంగా అనురాధతో పాటు భర్త కిషన్ రావు కుటుంబమంతా కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలంగా కొనసాగుతోంది.తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు,మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె పార్టీలో చురుకైన కార్యకర్తలుగా పనిచేశారు."పదవులు శాశ్వతము కాదు-పార్టీ పటిష్టతే ప్రధానం" అనే లక్ష్యంతో కొనసాగిన ఆమెకు 2001 లో తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం గ్రామ ఎంపీటీసీగా పోటీ చేసే అవకాశం లభించింది.ఈ ఎన్నికల్లో ఒక వేయి 250 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.ఈ మెజార్టీ ఆనాటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే రికార్డ్ సృష్టించింది.అనంతరం తుంగతుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలుగా నియమితులై అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.ఆమె రెండోసారి ఎన్నిక కావడం పట్ల సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పార్టీతోపాటు,అనుబంధ సంఘాలు,ఆప్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.