దిశ, హాలియా : అనుముల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హాలియా పోలిస్ స్టేషన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని స్థానిక ఎస్‌ఐ క్రాంతి కుమార్ కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ అనడం, ప్రభుత్వ మంత్రులు, శాసనసభ్యులు ప్రెస్‌మీట్‌లు పెట్టి అందుకు వత్తాసు పలకడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమాన పరిచినట్లే అని అన్నారు. అవగాహన లేని నాయకుల వల్ల భావితరాలకు భవిష్యత్తులో ఇలాంటి అవమానాలే ఎదురవుతాయని, 1949 సంవత్సరం రాజ్యాంగ సభలో మనం ఎంచుకునే నాయకులను బట్టి కూడా మంచి రాజ్యాంగం, చెడు రాజ్యాంగంగా మారుతుంది అని మాట్లాడారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఆనాటి మాటలను అక్షర సత్యాలు చేస్తున్నాయన్నారు.
కేసీఆర్ మాటలకు వత్తాసు పలుకుతూ గువ్వల బాలరాజు.. దళితులను ముఖ్యమంత్రిని చేయాలని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసారా అంటూ అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాజ్యాంగంలో ఉన్న హక్కుల ద్వారా శాసనసభ్యులుగా ఎన్నికై అనాలోచితంగా మాట్లాడడం సభ్య సమాజానికి సిగ్గుచేటని తెలిపారు. కాబట్టి భారత రాజ్యాంగం, అంబేద్కర్ గురించి కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తులు ఎలాంటి హోదాలలో ఉన్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల కృష్ణ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మజహార్ మోహినుద్దీన్, మాజీ జిల్లా యూత్ అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్, ఎస్టీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పాండు నాయక్, కుందూరు రాజేందర్రెడ్డి, పాంపాటి శ్రీనివాస్, వర్కాల శ్రీనివాస్ రెడ్డి, నకిరేకంటి సైదులు మాదిగ, పానుగంటి కోటయ్య, దండం రామ్ రెడ్డి, విద్యార్థి సంఘం నాయకులు నరసింహ తదితరులు పాల్గొన్నారు.