అధికారులు అందరూ బాధ్యతగా పని చేయాలి

జిల్లా కేంద్రంలో నల్గొండ మున్సిపాలిటీలో అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆర్‌అండ్‌బీ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు.

Update: 2024-03-13 14:44 GMT

దిశ, నల్గొండ: జిల్లా కేంద్రంలో నల్గొండ మున్సిపాలిటీలో అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆర్‌అండ్‌బీ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. నల్గొండ చుట్టూ కొండలు ఉండటం వల్ల వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని మంచినీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రెండు నెలల పాటు అధికారులు అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రజలందరికీ ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా మంచినీటిని ట్యాంకర్ల ద్వారా అందే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చూసుకోవాలని తెలిపారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కరువు కారణంగా మంచినీళ్లు లేక ప్రజల ఇబ్బందులకు గురవుతున్నారని నీటిని పొదుపుగా వాడుకునే విధంగా చూసుకోవాలన్నారు. కేసీఆర్ తెలంగాణకు చేసిన మోసం జగన్‌కి అమ్ముడుపోవడం, రోజా పెట్టిన చేపల పులుసు తిని ఆంధ్రకు నీళ్లు అందించడం. వాళ్లు బతకొద్దని మాట్లాడి మనకు మంచినీళ్లు కాదు కన్నీళ్లు మిగిల్చారని తెలిపారు.

కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉండి లక్షల కోట్లను ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ. 500 కే గ్యాస్ ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కేసీఆర్ దుర్మార్గుడని ఆయన అల్లుడు కొడుకు కలిపి హైదరాబాద్‌లో లిక్కర్ షాపులు, ఢిల్లీలో లిక్కర్ షాపులు అని అన్నారు. కేసీఆర్‌కి దేవుడు నడుము విరగగొట్టిండని అన్నారు. 70 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు బుద్ధి లేదన్నారు. ఎంపీ రంజిత్‌కి టికెట్ వద్దంటున్నాడు మల్లారెడ్డి కూడా అతని కుమారులకు టికెట్ వద్దు అని అంటున్నారు. ఏకైక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని తెలిపారు. భూమి ఆకాశం ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందంటున్న కేసీఆర్ రోజు నలుగురు నాయకులు బీఆర్ఎస్‌లో ఖాళీ అవుతున్నారని తెలిపారు.

మూడు ఫీట్ల మాజీ మంత్రి కాంగ్రెస్ వచ్చింది… కరువు వచ్చింది అంటున్నాడని, కేటీఆర్ కేసీఆర్ ఏం చేశారు అని ఎద్దేవా చేశారు. చచ్చిపోయిన పాముని ఎన్నిసార్లు కొడతామని అన్నారు. ఒక బిల్డింగ్ కూలగొట్టగానే కుమారుడికి టికెట్ వద్దని వెళ్లిన వెళ్లిపోయిన వ్యక్తి మల్లారెడ్డి అన్నారు. రూ. 20 వేల కోట్లతో ప్రతి మహిళా సంఘానికి ఒక కోటి రూపాయల చొప్పున ఇస్తూ వారికి ఆర్థిక సహాయం కల్పించడం అన్నారు. గత ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఇల్లు కట్టి ఇవ్వలేదని, దళిత ముఖ్యమంత్రి అని మోసం చేస్తివి ప్రెస్ వాళ్లకు ఇల్లు కట్టిస్తా అంటివి ఒక ఇల్లు కూడా కట్ట వైతివి అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. మా ప్రభుత్వం హయాంలో దళితుడిని ఉప ముఖ్యమంత్రిని చేసినం, స్పీకర్ చేసినం, ఇద్దరు మహిళలను మంత్రులు చేసినం అన్నారు. బీఆర్ఎస్‌కి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వస్తాయని అన్నారు.

టీ న్యూస్, నమస్తే తెలంగాణ చదివేది లేదు దాంట్లో వాళ్ళ డబ్బా మాత్రం ఉంటుంది అన్నారు. నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జూకిరి రమేష్‌ని ఎంపిక చేసినట్లు తెలిపారు. రైతుల వద్ద నుంచి ట్రాన్స్ఫార్మర్లు‌కు ఒక్క రూపాయి కూడా ఎవరు తీసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు, ఆర్డిఓ రవి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ , అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News