చెరువుగట్టు దేవాలయం చైర్మన్ పదవి కోసం పోటా పోటీ..!
తెలంగాణ శ్రీశైల క్షేత్రంగా పేరొందిన చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తుల సంఖ్య పెరగడంతో దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
దిశ, నార్కట్‌పల్లి: తెలంగాణ శ్రీశైల క్షేత్రంగా పేరొందిన చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తుల సంఖ్య పెరగడంతో దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాష్ట్రంలోనే పేరొందిన దేవాలయాల్లో ఒకటి గా నిలుస్తోంది. దీంతో ఈ దేవాలయ పాలకమండలిలో చోటు దక్కించుకోవడం కోసం ఆశావహులు భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. 14 మంది సభ్యులతో కూడిన పాలకమండలికి ఆగస్టు 23వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయగా సెప్టెంబర్ 11వ తేదీకి గడువు ముగిసింది. ఈ గడువులోపు 82 మంది దరఖాస్తు చేసుకోగా అందులో మహిళలు సైతం ఉన్నారు. 14 మందిలో ఒకరిని చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాలకమండలిలో చోటు దక్కించుకుని చైర్మన్ కావాలని అగ్ర నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే పాలకవర్గ కమిటీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాల నాటికి పాలకవర్గం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానికులు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ నేతల చుట్టూ తిరుగుతూ ఉన్నారు.
ఎవరికి వారే ప్రయత్నాలు..
చెరువుగట్టు దేవాలయం పాలకమండలిలో చోటు దక్కించుకోవడం కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంకు మొదటి నుంచి అండగా ఉన్నటువంటి కార్యకర్తలు తమకు అవకాశం దక్కుతుందని నమ్మకంతో ఉంటున్నారు. కానీ ఈ క్షేత్రం కోమటిరెడ్డి సోదరుల సొంత మండలం ప్రాంతంలో ఉండటంతో వారి అనుచరులు సైతం అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డామని ఈసారి తప్పకుండా మాకే పదవులు దక్కుతుందని ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాలకమండలిలో ఎమ్మెల్యే వేముల వీరేశం, కోమటిరెడ్డి సోదరుల అనుచరులు ఇద్దరు చైర్మన్ పదవి కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు.
స్థానికులకే చైర్మన్ పదవి ఇవ్వాలి..
ఆనవాయితీ ప్రకారం ఈ దేవాలయ చైర్మన్ పదవిని స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ సైతం గట్టిగా వినిపిస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలక మండలిని ఏర్పాటు చేయాలని అగ్ర నేతలు చూస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కుల సమీకరణలు దృష్టిలో ఉంచుకొని పాలక మండలి ఏర్పాటు చేయాలని దరఖాస్తు చేసుకున్న ఆశావహులు కోరుతున్నారు. స్థానిక డిమాండ్ తెరపైకి రావడంతో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అదేవిధంగా గత 10 ఏళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే ఈ దేవాలయానికి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఒక విడత ఎల్లారెడ్డిగూడెం మరోసారి చెరువుగట్టు గ్రామాలకు ప్రాధాన్యం దక్కింది. దీనిని దృష్టిలో ఉంచుకొని స్థానికులకే చైర్మన్ ఇవ్వాలని కోరుతున్నారు.
పాలకమండలితోనే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు..
రాబోయే పది రోజుల్లో దేవాలయ పాలక మండలిని ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఉన్న నేపథ్యంలో పాలకమండలిని పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో దరఖాస్తు చేసుకున్న ఆశావహుల పేర్లను నాయకులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ క్షేత్ర నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు సరైన మౌలిక వసతులు కల్పించడం లేదని భక్తులు ఆగ్రహానికి గురవుతున్న సందర్భాలు చూస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సేవా తత్పరులై ఉండి స్వామి వారికి సేవ చేస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసేవారిని పాలకమండలిలో చోటు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ పాలక మండలిని ఏర్పాటు చేస్తే శివయ్య సేవా భాగ్యం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.