జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి..

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇటీవల జర్నలిస్ట్ ముఖేష్ చంద్ర కార్ ని అతి క్రూరంగా హత్య చేశారు.

Update: 2025-01-05 16:39 GMT

దిశ, సూర్యాపేట టౌన్ : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇటీవల జర్నలిస్ట్ ముఖేష్ చంద్ర కార్ ని అతి క్రూరంగా హత్య చేసి, సెప్టిక్ ట్యాంక్ లో పడేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కఠినమైన చట్టాలు తీసుకురావాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, కార్యదర్శి బుక్క రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఛత్తీస్ ఘడ్ బీజాపూర్, బస్తర్ దండకారణ్యంలో ఉన్న ఆదివాసీల సమస్యలను వెలికితీయడంలో, నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా ముఖేష్ చాలా కీలకంగా ఉండేవాడని, దండకారణ్యంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరుగుతున్న పోరాటంలో నలిగిపోతున్న ఆదివాసీల హక్కుల కోసం జర్నలిస్టుగా ముఖేష్ జాతీయ స్థాయిలో ముఖేష్ చేసిన కృషి వెలకట్టలేనిదని వారన్నారు.

బీజాపూర్ జిల్లాలో ఒక రోడ్డు కాంట్రాక్టర్ 50 కోట్ల రూపాయల విలువైన రోడ్డు నిర్మాణ పనులకు ఎటువంటి మార్పులు లేకుండా 120 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచి ప్రజాధనాన్ని కొల్ల గొట్టాలని, చేసిన కుట్రను ముఖేష్ పలు వార్తా కథనాల ద్వారా బహిర్గతం చేయటం వల్ల కక్ష పెంచుకున్న ఆ కాంట్రాక్టర్ కిరాయి గుండాలతో అతి క్రూరంగా ముఖేష్ ని హత్య చేయించి సెప్టిక్ ట్యాంకులో దాచిపెట్టిన వైనం అత్యంత అమానవీయ సంఘటన అని అన్నారు. ముకేశ్ హత్యకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ముఖేష్ ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, దేశంలో జర్నలిస్టుల పట్ల జరుగుతున్న దాడులను అరికట్టడానికి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్ట్ రక్షణ కోసం ప్రత్యేకమైన కఠిన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. జాతీయ జర్నలిస్ట్ సంఘాలు ఆ దిశగా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్వాయి జానయ్య, నాయిని శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకల సైదులు గౌడ్, జిల్లా నాయకులు బుక్క ఉపేందర్, తండా నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News