గర్భస్థ స్త్రీలు, శిశువుల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

గర్భిణీ స్త్రీల గర్భస్థ శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న ఏఎన్సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు.

Update: 2025-01-05 16:33 GMT

దిశ, నల్లగొండ : గర్భిణీ స్త్రీల గర్భస్థ శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న ఏఎన్సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఆయన నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆంటీ నేటల్ పరీక్షల భవన పనుల నిర్మాణానికి పూజ చేశారు. గర్భస్థ పరీక్షల నిమిత్తం ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, అంతేకాక ప్రసవానికి ముందు ఆసుపత్రిలో చేరే వారు, వారి సహాయకులకు అనువుగా ఉండేందుకు గాను ఈ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ నిర్మాణాన్ని నాణ్యతగా చేపట్టాలని, అంతేకాక సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆయన ఆదేశించారు. మంత్రి ఆసుపత్రిలోని పలు వార్డులను, విభాగాలను పరిశీలించారు. పోస్ట్ నేటల్ వార్డు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు . అలాగే పోస్ట్ నేటల్ వార్డులో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రసవం తర్వాత తల్లి, బిడ్డల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాల పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ వార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇందులో భాగంగా అవసరమైన సౌకర్యాలను కల్పించాలని అన్నారు. ఆస్పత్రిలో పనిచేసే పలువురు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఇతర ప్రాంతాల్లో డిప్రెషన్ పై పని చేస్తూన్నారని తెలుసుకున్న మంత్రి ఆస్పత్రి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిలోనే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గైనిక్, జనరల్ సర్జన్, స్టాఫ్ నర్సుల కొరతను తీరుస్తామని ఆయన ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మంచి సేవలను అందించిన బెస్ట్ డాక్టర్ కు ప్రతినెల 15,000 రూపాయల పారితోషకం ఇచ్చే విధంగా ఇదివరకే ప్రకటించామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఎంహెచ్ఓ డాక్టర్ పొట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జీజీహెచ్ ఇంచార్జ్ సూపరింటిండెంట్ డాక్టర్ నగేష్, డాక్టర్ వందన, డాక్టర్ స్వరూపా రాణి, తదితరులు ఉన్నారు. అనంతరం మంత్రి స్థానిక ఐటీఐలో నిర్మాణంలో ఉన్న ఏటీసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.


Similar News